Biocon Biologics: బయోకాన్‌ మెగా డీల్‌

1 Mar, 2022 04:13 IST|Sakshi

వయాట్రిస్‌ బయోసిమిలర్స్‌ కైవసం

ఒప్పంద విలువ రూ.25,140 కోట్లు

న్యూఢిల్లీ: లేడీబాస్‌ కిరన్‌ మజుందార్‌షా నేృతృత్వంలోని ఔషధాలు, ఆరోగ్య సేవల రంగంలో దూసుకెళ్తోన్న బయోకాన్‌ భారీ డీల్‌కు తెరలేపింది. యూఎస్‌కు చెందిన హెల్త్‌కేర్‌ కంపెనీ వయాట్రిస్‌ బయోసిమిలర్స్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బయోకాన్‌ బయోలాజిక్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ సుమారు రూ.25,140 కోట్లు. ఇందులో నగదుతోపాటు బయోకాన్‌ బయోలాజిక్స్‌కు చెందిన రూ.7,550 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్షియల్‌ షేర్స్‌ను వయాట్రిస్‌కు జారీ చేస్తారు. కంపెనీలో ఇది 12.9 శాతం ఈక్విటీకి సమానం. రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డు ఈ లావాదేవీని ఆమోదించింది. 2022 జూలై–డిసెంబర్‌ మధ్య డీల్‌ పూర్తి కానుంది. ఒప్పందంలో భాగంగా వయాట్రిస్‌ అంతర్జాతీయ బయోసిమిలర్స్‌ వ్యాపారాన్ని బయోకాన్‌ బయోలాజిక్స్‌ దక్కించుకుంటుంది. దానితో పాటు లైసెన్స్‌ పొందిన బయోసిమిలర్స్‌ ఆస్తుల పోర్ట్‌ఫోలియో కూడా చేజిక్కించుకుంటుంది.  

రెండేళ్లలో ఐపీవోకు..: ఈ వ్యూహాత్మక కలయిక రెండు భాగస్వాముల పరిపూర్ణమైన సామర్థ్యాలు, బలాలను ఒకచోట చేర్చుతుందని బయోకాన్‌ బయోలాజిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఈ సందర్భంగా తెలిపారు. ‘యూఎస్, యూరప్‌లోని అభివృద్ధి చెందిన మార్కెట్లలో బయోకాన్‌ బయోలాజిక్స్‌ ఒక బలమైన వాణిజ్య వేదికను పొందేందుకు, ప్రపంచ బ్రాండ్‌ను నిర్మించేందుకు, సంస్థ ప్రయాణాన్ని వేగిరం చేయడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. బయోకాన్‌ బయోలాజిక్స్‌ రెండేళ్లలో ఐపీవోకు రానుంది. తాజా డీల్‌తో కంపెనీ విలువ రూ.60,400 కోట్లకు చేరుతుంది. ఐపీవో చాలా ఆకర్షణీయమైన స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాం. వాటాదార్లకు భారీగా విలువను సృష్టించబోతోంది. వయాట్రిస్‌ డీల్‌తో బయోసిమిలర్స్‌ రంగంలో బయోకాన్‌ బయోలాజిక్స్‌ లీడర్‌గా మారడానికి సహాయపడుతుంది. 2020–21లో రూ.2,900 కోట్ల ఆదాయం ఆర్జించాం’ అని వివరించారు.

సుమారు రూ.7,550 కోట్లు..
వయాట్రిస్‌ బయోసిమిలర్స్‌ ఆదాయం వచ్చే ఏడాది సుమారు రూ.7,550 కోట్లు ఉంటుందని అంచనా. ఈ డీల్‌ కారణంగా బయోకాన్‌ ప్రస్తుత శ్రేణి వాణిజ్యీకరించిన ఇన్సులిన్‌లు, ఆంకాలజీ, ఇమ్యునాలజీ బయోసిమిలర్స్‌తోపాటు అభివృద్ధిలో ఉన్న అనేక ఇతర బయోసిమిలర్స్‌ ఆస్తులతో కూడిన సమగ్ర పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటానికి సాయపడుతుంది. ప్రస్తుతం 20 బయోసిమిలర్స్‌ పోర్ట్‌ఫోలియోను బయోకాన్‌ ఖాతాలో ఉంది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లైఫ్‌ సైన్సెస్‌తో గతంలో ప్రకటించిన భాగస్వామ్యం ద్వారా వ్యాక్సిన్‌ పోర్ట్‌ఫోలియో సైతం తన ఖాతాకు జోడించింది. అంతర్జాతీయ బయోసిమిలర్స్‌ రంగంలో ధరల ఒత్తిడిని తగ్గించడంలో ఈ డీల్‌ సహాయపడుతుందని బయోకాన్‌ బయాలాజిక్స్‌ ఎండీ అరుణ్‌ చందవర్కర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు