వృద్ధి బాటలో బయోమాస్‌ మార్కెట్‌

3 Mar, 2023 06:17 IST|Sakshi

2031 మార్చికి రూ.32,000 కోట్లు

1లాటైస్‌ నివేదిక అంచనా

న్యూఢిల్లీ: దేశంలో బయోమాస్‌ మార్కెట్‌ రానున్న సంవత్సరాల్లో మంచి వృద్ధిని చూడనుంది. 2030–31 నాటికి ఈ మార్కెట్‌ రూ.32,000 కోట్లను చేరుకోనుందని 1లాటైస్‌ నివేదిక తెలియజేసింది. ప్రభుత్వ పథకాల మద్దతుకుతోడు, అంతర్జాతీయ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీల పెట్టుబడులు ఈ మార్కెట్‌ వృద్ధికి సాయపడతాయని తెలిపింది. బయోమాస్‌ కోజనరేషన్‌ ప్రాజెక్టుకు మద్దతుగా కొత్త పథకాల ఆవిష్కరణతో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పాటి బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటుకు వీలు కలుగుతుందని అంచనా వేసింది. ‘‘భారత్‌లో వ్యాపార సంస్థలకు శుద్ధ, నమ్మకమైన విద్యుత్‌ సరఫరాకు డిమాండ్‌ పెరుగుతోంది.

దీంతో బయోమాస్‌ కీలక వనరుగా విద్యుత్‌ డిమాండ్‌ను అందుకోవడంలో ముఖ్య పాత్ర పోషించనుంది. భారత్‌లో ప్రస్తుతం బయోమాస్‌ ఉత్పత్తి సామర్థ్యం 10.2 గిగావాట్లుగా ఉంది. ఇది 2031 మార్చి నాటికి రూ.32,000 కోట్లకు విస్తరిస్తుంది’’అని 1లాటైస్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ మైటి పేర్కొన్నారు. బయోమాస్‌ ఎనర్జీ విభాగంలో పెట్టుబడులు, సహకారం రూపంలో సంస్థలకు అవకాశాలు ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ పెట్టుబడుల రాకతో పర్యావరణ అనుకూల విద్యుత్‌ను సంస్థలు ఆఫర్‌ చేయగలవని, నెట్‌ జీరో లక్ష్యాల సాధనకు ఉపయోగకరమని అభిప్రాయం వ్యక్తం చేసింది. బయోమాస్‌ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 4 శాతం చొప్పున పెరుగుతూ 2021–22 నాటికి 10 గిగావాట్లకు చేరుకున్నట్టు తెలిపింది.

మరిన్ని వార్తలు