బిర్లాసాఫ్ట్‌- హింద్‌ జింక్‌.. రికార్డ్స్‌

6 Aug, 2020 11:59 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

16 శాతం దూసుకెళ్లిన బిర్లాసాఫ్ట్‌

7 శాతం జంప్‌చేసిన హిందుస్తాన్‌ జింక్‌

52 వారాల గరిష్టాలను తాకిన షేర్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఐటీ సేవల రంగ కంపెనీ బిర్లాసాఫ్ట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇక మరోపక్క విదేశీ రీసెర్చ్‌ సంస్థ సిటీ బయ్‌ రేటింగ్‌ ప్రకటించిన నేపథ్యంలో మెటల్‌ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్‌ కౌంటర్‌కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

బిర్లాసాఫ్ట్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో బిర్లాసాఫ్ట్‌ లిమిటెడ్‌ దాదాపు రూ. 56 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 35 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 18 శాతం పెరిగి రూ. 915 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో తొలుత బిర్లాసాఫ్ట్‌ షేరు 18 శాతం దూసుకెళ్లి రూ. 149ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 16 శాతం జంప్‌చేసి రూ. 145 వద్ద ట్రేడవుతోంది. 

హిందుస్తాన్‌ జింక్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ హిందుస్తాన్‌ జింక్‌ కౌంటర్‌కు విదేశీ దిగ్గజం సిటీ బయ్‌ రేటింగ్‌ను ప్రకటించింది. టార్గెట్‌ ధరను సైతం గతంలో ఇచ్చిన రూ. 205 నుంచి రూ. 240కు పెంచింది. రానున్న రెండేళ్లలో ఈ షేరు 8 శాతం డివిడెండ్‌ ఈల్డ్‌ను అందించగలదని సిటీ తాజాగా అంచనా వేసింది. దీనికితోడు ఎల్‌ఎంఈలో జింక్‌, సిల్వర్‌ ధరలు బలపడుతుండటం కంపెనీకి లబ్దిని చేకూర్చగలదని అభిప్రాయపడింది.  ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో తొలుత హిందుస్తాన్‌ జింక్‌ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 236ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.3 శాతం లాభంతో రూ. 230 వద్ద ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు