బిర్లాసాఫ్ట్‌ దూకుడు- లక్స్‌ ఇండస్ట్రీస్‌ డీలా

18 Aug, 2020 14:09 IST|Sakshi

మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం ఎఫెక్ట్‌

18 శాతం దూసుకెళ్లిన బిర్లాసాఫ్ట్

‌52 వారాల గరిష్టానికి షేరు

4 శాతం పతనమైన లక్స్‌ ఇండస్ట్రీస్‌

గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ కంపెనీ బిర్లాసాఫ్ట్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో బిర్లాసాఫ్ట్‌ షేరు 18 శాతం దూసుకెళ్లింది. రూ. 178ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 15.5 శాతం జంప్‌చేసి రూ. 174 వద్ద ట్రేడవుతోంది. క్లౌడ్‌ ఆధారిత డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సేవలు అందించేందుకు యూఎస్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బిర్లాసాఫ్ట్‌ పేర్కొంది. తద్వారా మైక్రోసాఫ్ట్‌ ఎజ్యూర్‌, తదితర ప్రొడక్టులపై ఎండ్‌టుఎండ్‌ సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. తద్వారా 10 కోట్ల డాలర్ల(రూ. 750 కోట్లు) బిజినెస్‌ పొందే వీలున్నట్లు వివరించింది.

లక్స్‌ ఇండస్ట్రీస్
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ దుస్తుల తయారీ కంపెనీ లక్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ఎన్‌ఎస్‌ఈలో లక్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ప్రస్తుతం 4 శాతం పతనమై రూ. 1394 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1383 వరకూ జారింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో లక్స్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 31 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం క్షీణించి రూ. 247 కోట్లను తాకింది.

మరిన్ని వార్తలు