జూన్‌ 1నుంచి బీఐఎస్‌ హెల్మెట్స్‌ తప్పనిసరి

28 Nov, 2020 15:31 IST|Sakshi

నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర రోడ్‌ రవాణా శాఖ

బీఐఎస్‌ లేని హెల్మెట్ల తయారీ, విక్రయాలు నిషేధం

దేశంలో వార్షికంగా 1.7 కోట్ల ద్విచక్ర వాహనాల తయారీ

ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వ యోచన

న్యూఢిల్లీ, సాక్షి: వచ్చే ఏడాది(2021) జూన్‌ 1నుంచి దేశంలో బీఐఎస్‌ ప్రమాణాలు లేని హెల్మెట్ల తయారీ, విక్రయాలను నిషేధిస్తూ కేంద్ర రోడ్‌ రవాణా శాఖ తాజా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ద్విచక్ర వాహనదారులను కొంతమేర ప్రమాదాల నుంచి రక్షించే యోచనలో భాగంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్నేళ్లుగా ఇందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చినట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. దేశంలో వార్షికంగా 1.7 కోట్ల ద్విచక్ర వాహనాలు తయారవుతున్నట్లు ఆటో రంగ విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా.. దేశీ పరిస్థితులకు అనుగుణంగా బీఐఎస్‌ ప్రమాణాలతో తేలికపాటి హెల్మెట్ల తయారీ, వినియోగానికి అనుమతించినట్లు నిపుణులు పేర్కొన్నారు.    

తలకు తగిలే గాయాలు
రోడ్డు ప్రమాదాలలో 45 శాతం తలకు గాయాలవుతుంటాయని ఎయిమ్స్‌ ట్రౌమా సర్జరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అమిత్‌ గుప్తా పేర్కొంటున్నారు. వీటిలో 30 శాతం తీవ్రంగా గాయపడిన సందర్భాలుంటాయని తెలియజేశారు. దేశీయంగా హెల్మెట్లకు బీఐఎస్‌ సర్టిఫెకెట్‌(ఐఎస్‌ఐ మార్క్‌)ను తప్పనిసరి చేయాలని కొంతకాలంగా రోడ్‌ రవాణా శాఖ ప్రయత్నిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సుమారు 44,000-56,000 మంది హెల్మెట్లను ధరించకపోవడంతో మరణించినట్లు అనధికార లెక్కలున్నట్లు ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. దేశీయంగా రోజూ 2 లక్షల హెల్మెట్లు విక్రయమవుతాయని ద్విచక్ర వాహన హెల్మెట్ల తయారీదారుల అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ కపూర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే వీటిలో అత్యధికం ప్రమాణాలులేనివే ఉంటాయని తెలియజేశారు. ప్రభుత్వం తీసుకురానున్న నిబంధనలతో వేలమంది ప్రాణాలకు రక్షణ లభించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా