రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్

14 Apr, 2021 17:06 IST|Sakshi

క్రిప్టోకరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ విలువ రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. తాజాగా క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్‌లో 62 వేల డాల‌ర్ల మార్క్‌ను దాటి 63,825.56 డాల‌ర్ల రికార్డు ధ‌ర ప‌లికింది. మార్చి నెలలో 61వేల డాలర్లను క్రాస్ చేసి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన బిట్ కాయిన్ ఇప్పుడు ఆ రికార్డును తుడిపేసింది. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ పోతుంటే, ఆంతే స్థాయిలో బిట్ కాయిన్ విలువ కూడా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరుగుతుండటంతో దాని విలువ పెరుగుతోంది.

క్రిప్టోకరెన్సీలో బిట్ కాయిన్ చాలా ప్రధానమైనది కాబట్టి దాని విలువ రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. కాయిన్ బేస్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ విలువ ఏకంగా 70 నుంచి 100 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని ఒక అంచ‌నా. ఇక, 2018లో కుదేలైపోయిన బిట్ కాయిన్‌ గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి విశ్వరూపం ప్రదర్శిస్తుంది. 2020 అక్టోబ‌ర్లో 12 వేల డాల‌ర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ గ‌త నెల‌లో 60 వేల డాల‌ర్ల మార్కు దాటడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుత రేటు ప్రకారం మ‌న‌ కరెన్సీలో బిట్ కాయిన్ ధర దాదాపు 50 లక్షలకు చేరిపోయింది. టెస్లా కంపెనీ అధినేత ఎల‌న్‌మ‌స్క్ పెట్టుబ‌డులు పెట్టడంతో పాటు ప‌లు ఇంటర్నేష‌న‌ల్ ఫైనాన్స్ స‌ర్వీసెస్ సంస్థలు కూడా త‌మ వినియోగదారుల్ని బిట్ కాయిన్‌తో లావాదేవీల‌కు అనుమ‌తించ‌డం బిట్ కాయిన్ విలువ భారీగా పెరిగిపోవడానికి తక్షణ కారణాలుగా కనిపిస్తున్నాయి.

చదవండి: డాలర్, బంగారానికి బిట్ కాయిన్ ప్రత్యామ్నాయమా?

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు