క్రిప్టో కరెన్సీ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు..!

21 Jan, 2022 19:36 IST|Sakshi

మొన్నటి దాకా మంచి లాభాలను తెచ్చిపెట్టిన క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు భారీ నష్టాలను తెచ్చిపెడుతుంది. క్రిప్టో కరెన్సీ దెబ్బకు ఇన్వెస్టర్లు అందరూ విలవిల్లాడుతున్నారు. క్రిప్టో మార్కెట్లు నేడు(జనవరి 21) భారీగా పతనం అవుతున్నాయి. క్రిప్టో కరెన్సీ దెబ్బకు ట్రేడర్లు విక్రయాలు చేపట్టారు. గత 24 గంటల్లో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ 5.97 శాతం తగ్గి రూ.28.44 లక్షల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ విలువ రూ.55.00 లక్షల కోట్లుగా ఉంది. ఒక్క రోజులోనే రూ.5 లక్షల కోట్ల మేర విలువ ఆవిరైంది. 

బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ 7.71 శాతం తగ్గి రూ.205,958.68 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దీని మార్కెట్‌ విలువ రూ.25.55 లక్షల కోట్లుగా ఉంది. దాదాపు రూ.2 లక్షల కోట్లు తగ్గిపోయింది. బైనాన్స్‌ కాయిన్‌ 7.50 శాతం తగ్గి రూ.34,461, టెథెర్‌ 0.03 శాతం పెరిగి రూ.81.21, సొలానా 11.41 శాతం తగ్గి రూ.9,819 వద్ద కొనసాగుతున్నాయి. టెథర్‌, యూఎస్‌డీ స్వల్పంగా పెరగడం మినహా మరేవీ లాభాల్లో లేవు. లూప్‌రింగ్‌, లైవ్‌పీర్‌, యార్న్‌ ఫైనాన్స్‌, హార్మొని, ఎన్‌కేఎన్‌, కీప్‌ నెట్‌వర్క్‌, అల్గొరాండ్‌ 13 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

పెరిగిన కరోనా కేసులు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా, రష్యాల మధ్య తలెత్తిన ఉద్రిక్తల వల్ల క్రిప్టో మైనింగ్ పరిశ్రమకు నిలయమైన రష్యా అన్ని క్రిప్టోకరెన్సీల వినియోగం, మైనింగ్ పై నిషేధాన్ని విధించాలని చూస్తుంది. రష్యాలోని సుమారు 17 మిలియన్ క్రిప్టో వాలెట్లలో 7 ట్రిలియన్ రూబుల్స్ (92 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ కు చెందిన క్రిప్టో ఎక్స్ఛేంజ్ Crypto.com, తమ క్రిప్టో కరెన్సీ దొంగిలించినట్లు పలువురు వినియోగదారులు ఫిర్యాదులు చేయడంతో ఈ వారం కొద్ది సేపు భద్రతల నేపథ్యంలో ట్రెండింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. 

(చదవండి: రిపబ్లిక్ డే రోజున మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్..!)

మరిన్ని వార్తలు