Bitcoin: 2022 నాటికి రూ.1.85 కోట్లకు చేరనుందా..!

18 Jun, 2021 19:03 IST|Sakshi

బిట్‌కాయిన్‌ పెరిగిందంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. పడిందంటే పాతాళం అంచుల దాకా పడిపోతుంది. మళ్లీ అంతలోనే రాకెట్‌లా ఆకాశానికి రివ్వున దూసుకెళ్లిపోతుంది. పెరిగినా, తగ్గినా ఇన్వెస్టర్లకు నిద్రపోకుండా చేస్తోంది బిట్‌కాయిన్‌.  ఈ ఏడాది తొలినాళ్లలో 20,000 డాలర్ల స్థాయి నుంచి ఏప్రిల్‌ నాటికి 60,000 డాలర్లకు ఎగిసిన బిట్‌కాయిన్‌ మే నెలలో అమాంతం దాని​ విలువ సగానికి పడిపోయింది.

ప్రముఖ బిలియనీర్‌, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ టిమ్‌ డ్రేపర్‌ బిట్‌కాయిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2022 చివరినాటికి  బిట్‌కాయిన్‌ సుమారు 2,50,000 డాలర్ల (సుమారు రూ. 1.85 కోట్లు)కు చేరుతుందని జోస్యం చెప్పాడు. గత కొన్ని నెలల నుంచి నేలచూపులు చూస్తోన్న క్రిప్టోకరెన్సీ రానున్న రోజుల్లో తిరిగి మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా దేశాల నుంచి బిట్‌కాయిన్‌కు ఆమోదం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎలన్‌ మస్క్‌ వరుస ట్విట్లు, చైనా ఆంక్షలతో బిట్‌కాయిన్‌ తీవ్ర ఒడిదుడుకలకు గురైన విషయం తెలిసిందే.

రాబోయే రోజుల్లో బిట్‌కాయిన్‌ను ప్రముఖ దిగ్గజ కంపెనీలు చెల్లింపుల కోసం  కచ్చితంగా ఉపయోగిస్తాయని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం 18 మిలియన్ల బిట్‌కాయిన్‌లో చెలామణీలో ఉండగా అది 21 మిలియన్లకు చేరుకుంటుందని తెలిపారు. టిమ్‌ డ్రేపర్‌ ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌. ట్విటర్‌, స్కైప్‌, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ కంపెనీల తొలినాళ్లలో భారీగా పెట్టుబడులను పెట్టారు.

చదవండి: క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌ వాజిర్‌ఎక్స్‌కు ఈడీ నోటీసులు

మరిన్ని వార్తలు