రూ.1,500 కోట్లతో బిట్స్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌

29 Jan, 2021 05:30 IST|Sakshi

న్యూఢిల్లీ: బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) పిలానీ.. బిట్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (బీఐటీఎస్‌ఓఎం)ను ప్రారంభించనుంది. ఈ ఏడాది జూలైలో 120 మంది విద్యార్థులతో తొలి బ్యాచ్‌ మొదలుకానుంది. సెంట్రల్‌ ముంబైలోని పోవై తాత్కాలిక క్యాంపస్‌లో బోధనా తరగతులుంటాయి. రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో రూ.60 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది 2024 నాటికి సిద్ధమవుతుందని బిట్స్‌ పిలానీ చాన్సలర్‌ కుమార్‌ మంగళం బిర్లా తెలిపారు. రెండేళ్ల రెసిడెన్షియల్‌ బిజినెస్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందించనున్నారు.

కోర్స్‌ ఫీజు రూ. 24 లక్షలు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, సింగపూర్‌ మేనేజ్‌ మెంట్‌ యూనివర్శిటీ, కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అగ్రశ్రేణి బిజినెస్‌ స్కూల్స్‌ ప్రొఫెసర్లతో విద్యా బోధన ఉంటుంది. ‘‘ఎం బీఏ కంటెంట్, డెలివరీ ఫార్మాట్స్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ద్వారా వ్యాపార నమూనాలు, విధానాలు ఎలా మారుతున్నాయో, కొనుగోలుదారులు అవసరాలకు తగ్గ డిజైన్స్‌ ఎలా పరిష్కరించబడుతున్నాయో అలాంటి మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని’’ కుమార్‌ మంగళం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు