బ్లాక్ మండే- 812 పాయింట్లు డౌన్‌

21 Sep, 2020 16:01 IST|Sakshi

38,034 వద్ద ముగిసిన సెన్సెక్స్‌

ఇంట్రాడేలో 38,000 పాయింట్ల దిగువకు

255 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ- 11,250కు

ఎన్ఎస్‌ఈలో అన్ని రంగాలూ భారీగా పతనం

బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 3.7% చొప్పున డౌన్‌

ఉన్నట్టుండి అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లకు షాక్‌ తగిలింది. వెరసి గత ఆరు నెలల్లోలేని విధంగా మార్కెట్లు బోర్లా పడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,000 స్థాయిని సైతం కోల్పోయింది. చివరికి 812 పాయింట్లు పడిపోయి 38,034 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 255 పాయింట్లు పతనమై 11,250 వద్ద నిలిచింది. తొలుత అటూఇటుగా మొదలైన మార్కెట్లలో మిడ్‌సెషన్‌ నుంచీ ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా 38,991 పాయింట్ల గరిష్టం నుంచి సెన్సెక్స్‌ ఒక దశలో 37,946 వరకూ జారింది. ఇక నిఫ్టీ 11,535- 11,219 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. వెరసి ఇంట్రాడే కనిష్టాల సమీపంలోనే మార్కెట్లు స్థిరపడటం గమనార్హం! వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో కేంద్రానికి ఎదురవుతున్న సవాళ్లు, చైనాతో సరిహద్దు  వివాదాలు, యూరోపియన్‌ దేశాలలో మళ్లీ తలెత్తుతున్న కోవిడ్‌-19 కేసులు తదితర ప్రతికూలతలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు పలు గ్లోబల్‌ బ్యాంకులలో అవకతవకలు జరిగాయంటూ వెలువడిన ఆరోపణలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు తెలియజేశారు. 

బేర్‌.. బేర్‌
ఎన్ఎస్‌ఈలో ఐటీ 0.7 శాతం నీరసించగా.. మిగిలిన అన్ని రంగాలూ 6-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కొటక్‌ బ్యాంక్‌ మాత్రమే అదికూడా 0.8-0.25 శాతం మధ్య బలపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇతర బ్లూచిప్స్‌లో ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎయిర్టెల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ, సిప్లా, మారుతీ, యాక్సిస్, గెయిల్‌, నెస్లే, జీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, బ్రిటానియా, ఐవోసీ, ఎస్‌బీఐ, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్, సన్‌ ఫార్మా 8.6-3.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

నేలచూపులోనే
డెరివేటివ్‌ విభాగంలో ఐబీ హౌసింగ్‌, జిందాల్‌ స్టీల్‌, బీఈఎల్‌, పీవీఆర్, బంధన్‌ బ్యాంక్‌, ఐడియా, టాటా కన్జూమర్‌, సెయిల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పిరమల్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌, అశోక్‌ లేలాండ్‌, గ్లెన్‌మార్క్‌, పీఎన్‌బీ, బాలకృష్ష, బయోకాన్‌  13-6.5 శాతం మధ్య కుప్పకూలాయి. నిఫ్టీ దిగ్గజాలను మినహాయిస్తే.. లాభపడ్డ కౌంటర్లు లేకపోవడం గమనార్హం! బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 3.7 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 2,165 నష్టపోగా.. కేవలం 594 లాభాలతో ముగిశాయి.

స్వల్ప కొనుగోళ్లు..
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 205 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 101 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 250 కోట్లు, డీఐఐలు రూ. 1,068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.   

మరిన్ని వార్తలు