రియల్టీలో నల్లధనం తగ్గుముఖం

26 Feb, 2022 10:46 IST|Sakshi

ప్రక్షాళనకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది 

హౌసింగ్‌ కార్యదర్శి మనోజ్‌ జోషి 

న్యూఢిల్లీ: దేశ రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రక్షాళనకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, ఫలితంగా ప్రాపర్టీ ఒప్పందాల్లో నల్లధనం తగ్గుముఖం పట్టినట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్‌ జోషి తెలిపారు. 

నరెడ్కో–మహి (సంఘం మహిళా విభాగం) నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జోషి మాట్లాడారు. ‘‘స్టాంప్‌ డ్యూటీ దిగొచ్చింది. దీన్ని మరింత తగ్గించాలి. వ్యాపారాలు పారద్శకంగా నడుస్తున్నాయా (చట్టబద్ధమైన ధనంతో) లేక నల్లధనంతోనా అన్నది నిర్ణయించడంలో స్టాంప్‌ డ్యూటీ కీలక పాత్ర పోషిస్తుంది. నరెడ్కో, నిర్మాణ రంగం మరింత మంది మహిళా నిపుణులను ఈ రంగంలోకి తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తుండడం స్ఫూర్తిదాయకం’’ అని పేర్కొన్నారు. 

రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ మరింత పారదర్శకంగా మారితే పనిచేసేందుకు ఎక్కువ మంది మహిళలు ముందుకు వస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘గురుగ్రామ్‌ ప్రాంతానికి చెందిన ఒక స్నేహితుడు నిన్ననే నాకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. చాలా వరకు ప్రాపర్టీ లావాదేవీలు ‘వైట్‌’ (స్వచ్ఛం)గానే జరుగుతున్నట్టు చెప్పాడు. మొత్తం చెల్లింపులు పారదర్శక మార్గంలోనే నడుస్తున్నాయి’’ అని జోషి వెల్లడించారు   
చదవండి: ఫ్లాట్‌ కొంటున్నారా? అదనపు వసూళ్లు తప్పడం లేదా? రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయి

మరిన్ని వార్తలు