బ్లాక్‌స్టోన్‌ చేతికి సింప్లిలెర్న్‌

20 Jul, 2021 04:50 IST|Sakshi

డిజిటల్‌ నైపుణ్యాల శిక్షణ కంపెనీలో 70 శాతం వాటా కొనుగోలు 

డీల్‌ విలువ రూ. 1,860 కోట్లు

ఎడ్యుటెక్‌ సంస్థలపై బ్లాక్‌స్టోన్‌ గురి

న్యూఢిల్లీ: ఆధునిక తరం డిజిటల్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేసే సింప్లిలెర్న్‌ సొల్యూషన్స్‌లో పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ మెజారిటీ వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్‌ విలువ 25 కోట్ల డాలర్లు(రూ. 1,860 కోట్లు)కాగా.. ఎడ్యుటెక్‌ కంపెనీ సింప్లిలెర్న్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన కలారి క్యాపిటల్, హెలియన్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్, మేఫీల్డ్‌ ఫండ్‌ ఉమ్మడిగా 60 శాతం వాటాను విక్రయించనున్నాయి. అంతేకాకుండా మరో 10 శాతం వాటాను ప్రమోటర్లు, ఇతర యాజమాన్య వ్యక్తులు విక్రయించనున్నారు. వెరసి కంపెనీ విలువను 40 కోట్ల డాలర్ల(రూ. 2,976 కోట్లు)కు చేరింది.

పలు కంపెనీలలో
దేశీయంగా బ్లాక్‌స్టోన్‌గ్రూప్‌ ఇప్పటికే బైజూస్, ఆకాస్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్, అసెండ్‌ లెర్నింగ్, ఎల్యుషియన్‌ అండ్‌ ఆర్టిక్యులేట్‌లలో ఇన్వెస్ట్‌ చేసింది. అయితే తొలిసారి సింప్లిలెర్న్‌లో మెజారిటీ వాటా కొనుగోలు ద్వారా యాజమాన్య నియంత్రణను చేపడుతోంది. కాగా.. కంపెనీ నిర్వహణ బాధ్యతను కొనసాగించనున్నట్లు సింప్లిలెర్న్‌ సీఈ వో కృష్ణ కుమార్‌ ఈ సందర్భంగా తెలియజేశారు.

లాభాలతో..  
2010లో ప్రారంభమైన సింప్లిలెర్న్‌ గత నాలుగేళ్లుగా లాభాలను ఆర్జిస్తోంది. తొలి దశ నుంచి మధ్యస్థాయి వృత్తి నిపుణుల వరకూ 100 రకాల ప్రోగ్రామ్స్‌ను కంపెనీ అందిస్తోంది. తద్వారా కొత్త తరం డిజిటల్‌ నైపుణ్యాల మెరుగులో సహకరిస్తోంది. దీనిలో భాగంగా క్లౌడ్, డెవాప్స్, డేటా సైన్స్, ఏఐ, మెషీన్‌ లెర్నింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, సైబర్‌ సెక్యూరిటీ తదితర శిక్షణను సమకూర్చుతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా వృత్తి నిపుణులు సింప్లిలెర్న్‌ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకుంటున్నారు. పలు దేశ, విదేశీ యూనివర్శిటీలతో కంపెనీ సహకార ఒప్పందాలను కలిగి ఉంది.

>
మరిన్ని వార్తలు