అవి చూసే ఫెయిలయ్యా: 75 లక్షలకు ప్లాన్‌, సుప్రీం రియాక్షన్‌

9 Dec, 2022 18:38 IST|Sakshi

న్యూఢిల్లీ: యూట్యూబ్‌లో అసభ్యకరమైన కంటెంట్  ప్రకటనల కారణంగా తన దృష్టి  మళ్లిందని తదర్వారా పరీక్షలో ఫెయిల్‌ అయ్యానని దాఖలైన పిటీషన్‌పై సీరియస్‌గా స్పందించింది. "ఆర్టికల్ 32 కింద దాఖలైన అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇదొకటి" అని ధర్మాసనం పేర్కొంది. ఈ రకమైన పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృధా చేస్తాయంటూ ఆగ్రహం వ్య​క్తం చేసింది. అంతేకాతు పిటీషనర్‌కు భారీ జరిమానా కూడా  విధించింది. దీంతో  పిటీషనర్‌ లబోదిబోమన్నాడు.

వివరాలను పరిశీలిస్తే..గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌లో వచ్చిన అశ్లీల ప్రకటనల కారణంగా తాను పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్‌కాలేక, ఎగ్జామ్‌ ఫెయిలయ్యానని ఇందుకు రూ. 75 లక్షల పరిహారం ఇప్పించాలంటూ ఆనంద్ కిషోర్ చౌదరి అనే ఒక నిరుద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్ పోలీసు పరీక్షకు సన్నద్ధమవుతున్న సమయంలో తమ దృష్టిని మరల్చేలా లైంగిక, అసభ్యకరమైన యాడ్స్‌ చూపించారంటూ ఆరోపిస్తూ  పిటీషన్‌ దాఖలు చేశాడు.

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం  శుక్రవారం కొట్టివేసింది.  నచ్చకపోతే యాడ్స్‌ చూడకండి, వాటిని చూడాలా వద్దా అనేమీ మీ హక్కు అని పేర్కొంది. ఇలాంటి పిటిషన్‌లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లక్షరూపాయల జరిమానా విధించింది. అయితే తాను నిరుద్యోగినని, క్షమించి జరిమానా తగ్గించాలని వాపోవడంతో కోర్టు కనికరించింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేయొద్దని ధర్మాసనం మందలించింది.జరిమానా తగ్గిస్తాం కానీ క్షమించ లేమంటూ జరిమానాను రూ. 25 వేలకు తగ్గించింది. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రంలో ఈ సొమ్మును డిపాజిట్ చేయాలని అతగాడిని ఆదేశించింది. 
 

మరిన్ని వార్తలు