బ్లూచిప్స్‌ వీక్‌- యూఎస్‌ మార్కెట్లు డౌన్

29 Jul, 2020 09:36 IST|Sakshi

3ఎం- మెక్‌డొనాల్డ్స్‌ 5-2.5% మధ్య పతనం

4 శాతం జంప్‌చేసిన ఫార్మా దిగ్గజం ఫైజర్‌

ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై చర్చోపచర్చలు!

నేడు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయాలు

ప్రధానంగా బ్లూచిప్‌ స్టాక్స్‌ నష్టపోవడంతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు నీరసించాయి. డోజోన్స్‌ 205 పాయింట్లు(0.8 శాతం) బలహీనపడి 26,379కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 21 పాయింట్ల(0.7 శాతం) వెనకడుగుతో 3,218 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 134 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 10,402 వద్ద నిలిచింది. రెండు రోజులపాటు నిర్వహించిన పాలసీ సమీక్షా నిర్ణయాలను నేడు కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించనుంది. కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఫెడ్‌ సరికొత్త ప్యాకేజీపై స్పందించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. జూన్‌లో నిరుద్యోగిత పెరగడం, జులైలో వినియోగ విశ్వాస సూచీ డీలాపడటం వంటి అంశాల నేపథ్యంలో ఫెడ్‌ నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

ప్యాకేజీ ఇలా
కోవిడ్‌-19 ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు దన్నుగా రిపబ్లికన్స్‌ ట్రిలియన్‌ డాలర్ల సహాయక ప్యాకేజీని ప్రతిపాదిస్తున్నారు. దీనిలో భాగంగా నిరుద్యోగులకు 1200 డాలర్ల చొప్పున ప్రత్యక్ష చెల్లింపులకు ప్రతిపాదించారు. ఇదే విధంగా చిన్నతరహా బిజినెస్‌లకు రుణాలకింద 60 బిలియన్‌ డాలర్లు విడుదల చేయాలని సూచించారు. ఈ బాటలో స్కూళ్లకు 100 బిలియన్‌ డాలర్లు కేటాయించారు. అయితే ప్యాకేజీ అంశంపై రిపబ్లికన్స్‌, డెమక్రాట్ల మధ్య చర్చలు అంత త్వరగా కొలిక్కివచ్చే అవకాశంలేదని విశ్లేషకులు పెదవి విరుస్తుండటం గమనార్హం!

ఫలితాల ఎఫెక్ట్‌
ఈ బుధ, గురువారాలలో టెక్నాలజీ దిగ్గజాలు యాపిల్‌, అల్ఫాబెట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ క్యూ2(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాలు ప్రకటించనున్నాయి. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్‌ 4 శాతం పతనంకాగా.. యాపిల్, నెట్‌ఫ్లిక్స్‌ 1.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. దీంతో నాస్‌డాక్‌ నీరసించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. క్యూ2లో ఫలితాలు నిరాశపరచడంతో డైవర్సిఫైడ్‌ దిగ్గజం 3ఎం కంపెనీ 5 శాతం పతనంకాగా.. సేమ్‌ స్టోర్‌ అమ్మకాలు నీరసించడంతో ఫాస్ట్‌ఫుడ్‌ చైన్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌ కార్ప్‌ 2.5 శాతం క్షీణించింది. అయితే ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ షేరు 4 శాతం జంప్‌చేసింది. కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో పూర్తిఏడాదికి పటిష్ట గైడెన్స్‌ను ప్రకటించడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు