న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మరో నలుగురు!

27 Sep, 2021 21:06 IST|Sakshi

జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజిన్ సోమవారం న్యూ షెపర్డ్ 18వ మిషన్‌ను ప్రకటించింది. ఎన్ఎస్-18వ మిషన్‌లో భాగంగా అక్టోబర్ 12న నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కక్ష్యలోకి తీసుకొని వెళ్లి మళ్లీ వెనక్కి తీసుకొని వస్తారు. నాసా మాజీ ఇంజనీర్ & ప్లానెట్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ క్రిస్ బోసుయిసెన్, గ్లెన్ డి వ్రీస్ - మెడిడేటా సహ వ్యవస్థాపకుడుతో  కలిసి మరో ఇద్దరు అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లనున్నారు. రాబోయే రోజుల్లో ఆ ఇద్దరి వ్యోమగాముల పేర్లను ప్రకటిస్తామని సంస్థ తెలిపింది.

బోసుయిసెన్ 2010లో ప్లానెట్ ల్యాబ్స్ (ప్లానెట్)ను సహ-స్థాపించాడు, ఐదు సంవత్సరాలు సీటిఓగా పనిచేశాడు. అతని నాయకత్వంలో ప్లానెట్ నానో ఉపగ్రహాలను వాణిజ్యపరంగా విక్రయించిన మొదటి సంస్థగా మారింది. 2008 నుంచి 2012 వరకు బోస్హుయిసెన్ నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్లో స్పేస్ మిషన్ ఆర్కిటెక్ట్ గా పనిచేశాడు. గ్లెన్ డి వ్రీస్ 1999లో మెడిడేటా సొల్యూషన్స్ ను సహ-స్థాపించారు. ఇది ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే క్లినికల్ రీసెర్చ్ ఫ్లాట్ ఫారం. జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూషెపర్డ్ వ్యోమనౌకలో జూలై 20న నలుగురు సభ్యుల బృందం నింగిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వ్యోమ నౌకలో జెఫ్‌ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్‌ బెజోస్‌, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. (చదవండి: నో కాస్ట్ ఈఎమ్ఐ వల్ల కలిగే లాభమేంటి?)

మరిన్ని వార్తలు