బ్లూస్టార్‌ ఉత్పత్తులకు హబ్‌గా శ్రీసిటీ: బిలియన్‌ డాలర్ల ఆదాయ లక్ష్యం 

18 Mar, 2023 16:47 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రాబోయే రోజుల్లో తమ ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ హబ్‌గా మారగలదని ఎయిర్‌ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్‌ ఉత్పత్తుల సంస్థ బ్లూస్టార్‌ ఎండీ బి. త్యాగరాజన్‌ చెప్పారు. ఇప్పటికే అక్కడ ఇన్వెస్ట్‌ చేసినవి, కొత్తగా చేయబోయేవి కలిపి రాబోయే మూడేళ్లలో మొత్తం రూ. 1,000 కోట్ల పైచిలుకు పెట్టుబడి పెట్టినట్లవుతుందని త్యాగరాజన్‌ వివరించారు. వ్యూహాత్మక స్థానంలో ఉన్నందున సరుకు రవాణా, నిల్వ చేసుకోవడం వంటి విషయాలకు సంబంధించి తమకు ఇది ప్రయోజనకరంగా ఉంటోందని పేర్కొన్నారు. (March18th పసిడి ప్రియులకు షాక్‌: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!)

శుక్రవారమిక్కడ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా త్యాగరాజన్‌ ఈ విషయాలు చెప్పారు. శ్రీసిటీలో రూమ్‌ ఏసీల తయారీకి సంబంధించి మొత్తం నాలుగు దశల్లో ప్రస్తుతం తొలి దశ పూర్తయి ఇటీవలే ఉత్పత్తి మొదలైందని చెప్పారు. మిగతావి కూడా పూర్తయితే 12 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అటు కమర్షియల్‌ ఏసీల తయారీకి సంబంధించి రెండో ప్లాంటు నిర్మాణం కోసం 40 ఎకరాలు సమీకరించినట్లు, 2024లో పనులు, 2025లో ఉత్పత్తి ప్రారంభం కాగలదని అంచనా వేస్తున్నట్లు త్యాగరాజన్‌ చెప్పారు. గత కొద్ది త్రైమాసికాలుగా సానుకూల ఫలితాలు నమోదు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బిలియన్‌ డాలర్ల ఆదాయం (దాదాపు రూ. 8,200 కోట్లు) అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ. 6,046 కోట్ల ఆదాయం నమోదు చేసింది.  

అంతర్జాతీయంగా విస్తరణ..: కొత్త విభాగాల్లో ప్రవేశించడంకన్నా ఇతర దేశాల్లో మరింత విస్తరించడంపై దృష్టి పెడుతున్నట్లు త్యాగరాజన్‌ చెప్పారు. ప్రస్తుతం మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తుండగా అమెరికా, యూరప్‌ తదితర మార్కెట్లలోనూ కార్యకలాపాలకు సిద్ధమవుతున్నట్లు వివరించారు. ఆయా మార్కెట్లకు ఈ ఏడాది ఆఖరు నుంచే ఎగుమతులు మొదలుపెట్టే అవకాశం ఉందన్నారు.   (Ugadi 2023 బిగ్‌ ‘సి’: వినూత్నఫెస్టివ్‌ ఆఫర్లు )

కొత్త ఫ్రీజర్ల శ్రేణి.. 
బ్లూస్టార్‌ ఆవిష్కరించిన కొత్త ఉత్పత్తుల శ్రేణిలో దేశీయంగా తీర్చిదిద్దిన డీప్‌ ఫ్రీజర్లు, రిఫ్రిజిరేషన్‌ ఉత్పత్తులు ఉన్నాయి. వీటి కూలింగ్, నిల్వ సామర్థ్యాలు మరింత అధికంగా ఉంటాయని, వీటిని మహారాష్ట్రలోని వాడా ప్లాంటులో తయారు చేశామని త్యాగరాజన్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో తమ సంస్థ వృద్ధికి కమర్షియల్‌ రిఫ్రిజిరేషన్‌ మరింతగా ఊతమివ్వగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ విభాగం నుంచి తమకు రూ. 70 కోట్లు, దక్షిణాదిలో రూ. 235 కోట్ల పైచిలుకు ఆదాయం వస్తోందన్నారు. మొత్తం అన్ని విభాగాల రీత్యా చూస్తే తమ సంస్థ 20–25 శాతం వృద్ధి సాధిస్తోందని, పరిశ్రమ వృద్ధి సుమారు 15–20 శాతం మేర ఉంటోందని పేర్కొన్నారు.  
   

మరిన్ని వార్తలు