బోట్‌లో రూ. 731 కోట్ల వార్‌బర్గ్‌ పింకస్‌ పెట్టుబడులు

7 Jan, 2021 04:15 IST|Sakshi

న్యూఢిల్లీ: హెడ్‌ఫోన్స్, ఇయర్‌ ఫోన్స్, స్మార్ట్‌ వాచెస్‌ వంటి కన్సూమర్‌ టెక్‌ ఉత్పత్తుల బ్రాండ్‌... బోట్‌లో అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, వార్‌బర్గ్‌ పింకస్‌ 10 కోట్ల డాలర్లు (రూ.732 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. వార్‌బర్గ్‌ పింకస్‌కు చెందిన అనుబంధ సంస్థ ఈ మేరకు తమ సంస్థలో ఇన్వెస్ట్‌ చేసిందని బోట్‌ వెల్లడించింది. ఈ లావాదేవీకి ఆర్థిక సలహాదారుగా అవెండాస్‌ క్యాపిటల్‌ వ్యహరించిందని పేర్కొంది. పరిశోధన, అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డీ) విభాగాన్ని మరింత శక్తివంతం  చేసుకోవడానికి, అగ్రస్థానంలో ఉన్న తమ మార్కెట్‌ను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ తాజా నిధులను వినియోగిస్తామని వివరించింది. భారత్‌లో తయారీ కార్యక్రమం కింద వివిధ ఉత్పత్తుల తయారీకి దన్నుగా ఉండే వ్యవస్థల కోసం కూడా ఈ నిధులను ఉపయోగిస్తామని వివరించింది.  ఐడీసీ(ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌) గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద ఐదవ వేరియబుల్‌ (ధరించే ఉత్పత్తుల) బ్రాండ్‌ తమదేనని పేర్కొంది.

మరిన్ని వార్తలు