లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు

7 Nov, 2022 12:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్‌ (క్యూ2)లో నికర లాభం 59 శాతం జంప్‌చేసి రూ. 3,313 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం రూ. 20,271 కోట్ల నుంచి రూ. 23,080 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం మరింత అధికంగా 34 శాతం ఎగసి రూ. 10,714 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.48 శాతం మెరుగై 3.33 శాతాన్ని తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 8.11 శాతం నుంచి 5.31 శాతానికి, నికర ఎన్‌పీఏలు 2.83 శాతం నుంచి 1.16 శాతానికి దిగివచ్చాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,754 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 1,628 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 15.25 శాతంగా నమోదైంది.  

ఐవోబీ లాభం జూమ్‌ 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ) ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 33 శాతం జంప్‌చేసి రూ. 501 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 376 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 5,028 కోట్ల నుంచి రూ. 5,852 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 10.66 శాతం నుంచి 8.53 శాతానికి, నికర ఎన్‌పీఏలు 2.77 శాతం నుంచి 2.56 శాతానికి దిగివచ్చాయి. వడ్డీ ఆదాయం రూ. 4,255 కోట్ల నుంచి రూ. 4,718 కోట్లకు బలపడింది.    
 

>
మరిన్ని వార్తలు