టాటా బోయింగ్‌ కేంద్రంలో కొత్త ప్రొడక్షన్‌ లైన్‌

6 Feb, 2021 06:07 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  ఏరోస్పేస్‌ ప్రొడక్ట్స్‌ తయారీలో ఉన్న టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ విమానం వెనుక భాగంలో ఉండే కీలక విడిభాగమైన వెర్టికల్‌ ఫిన్‌ స్ట్రక్చర్స్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇందుకోసం కొత్త ప్రొడక్షన్‌ లైన్‌ను జోడించింది. ఇక్కడ బోయింగ్‌ 737 రకానికి చెందిన విమానాల ఫిన్‌ స్ట్రక్చర్స్‌ను రూపొందిస్తారు. ఈ విస్తరణతో అదనపు ఉపాధి అవకాశాలతోపాటు నైపుణ్య అభివృద్ధికి వీలు కలుగుతుంది. బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సంయుక్తంగా టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ను హైదరాబాద్‌ సమీపంలోని ఆదిభట్ల వద్ద స్థాపించాయి. తాజా విస్తరణ మైలురాయిగా నిలుస్తుందని ఇరు సంస్థలు శుక్రవారం వెల్లడించాయి.

రక్షణ ఉత్పత్తుల తయారీలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడానికి జేవీకి ఉన్న నిబద్ధతకు కొత్త ప్రొడక్షన్‌ లైన్‌ మరొక నిదర్శనమని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఎండీ, సీఈవో సుకరన్‌ సింగ్‌ తెలిపారు. నూతన లైన్‌ను చేర్చడం భారత అంతరిక్ష, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ వృద్ధిలో గుర్తించదగ్గ ముందడుగు అని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. దేశంలో రక్షణ, ఏరోస్పేస్‌ పరిశ్రమకు తెలంగాణ ఒక స్థాపిత కేంద్రంగా ఉందని గుర్తుచేశారు. పెద్ద ఎత్తున నిపుణులైన, పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు ఇక్కడ కొలువుదీరారని తెలిపారు. కాగా, 14,000 పైచిలుకు చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ అత్యాధునిక ఫెసిలిటీలో బోయింగ్‌ ఏహెచ్‌–64 అపాచీ హెలికాప్లర్ల ప్రధాన భాగాలను సైతం తయారు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు