లక్ష్మీ విలాస్‌ విలీన స్కీమ్‌పై రగడ

27 Nov, 2020 06:47 IST|Sakshi

హైకోర్టుకు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు

ప్రతివాదులుగా ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం, డీబీఎస్‌ బ్యాంక్‌ 

స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ను (ఎల్‌వీబీ) డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియాలో విలీనం చేసే అంశం కొత్త మలుపు తిరిగింది. ఈ విలీన స్కీమ్‌పై స్టే విధించాలంటూ ఎల్‌వీబీ ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలు, వాటాదారైన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ .. బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశాయి. రిజర్వ్‌ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, డీబీఎస్‌ బ్యాంక్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నాయి. అయితే, విలీనంపై స్టే విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది.

‘విలీనంపై స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్‌ 14నకు వాయిదా వేస్తున్నాం. అప్పట్లోగా ప్రతివాదులు (ఆర్‌బీఐ, ఎల్‌వీబీ, డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా) తమ అఫిడవిట్లు దాఖలు చేయాలి‘ అని జస్టిస్‌ నితిన్‌ జమ్‌దార్, జస్టిస్‌ మిలింద్‌ జాదవ్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విలీనంతో తాము రూ. 188 కోట్లు నష్టపోనున్నట్లు కేసు విచారణ సందర్భంగా ఇండియాబుల్స్‌ వాదించింది.

అయితే, ప్రజలు, డిపాజిటర్లు, ఎల్‌వీబీ ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో విలీన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్‌బీఐ తరఫు న్యాయవాది రవి కదమ్‌ తెలిపారు. నవంబర్‌ 27 నుంచే విలీనం అమల్లోకి రానుండగా, సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.  మరోవైపు, విలీన పథకంలో భాగంగా సుమారు రూ. 320 కోట్ల విలువ చేసే టియర్‌2 బాండ్లను కూడా రైటాఫ్‌ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

పథకం ఏంటంటే..: విలీనానికి సంబంధించిన తుది స్కీమ్‌ ప్రకారం ఎల్‌వీబీ పెయిడప్‌ షేర్‌ క్యాపిటల్‌ మొత్తం రైటాఫ్‌ చేయనున్నారు. దీంతో వాటాదారులకు దక్కేదేమీ లేదన్న నేపథ్యంలోనే తమ పెట్టుబడంతా కోల్పోనున్న ప్రమోటర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా.. చట్టపరమైన చర్యలపై దృష్టి పెట్టారు. ప్రమోటర్‌ గ్రూప్‌నకు ఎల్‌వీబీలో 6.8% వాటాలు ఉన్నాయి. ఇక  సెప్టెంబర్‌ ఆఖరు నాటికి ఎల్‌వీబీలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు 4.99%, ప్రొలిఫిక్‌ ఫిన్‌వెస్ట్‌కు 3.36%, శ్రేయి ఇన్‌ఫ్రాకు 3.34%, ఎంఎన్‌ దస్తూర్‌ అండ్‌ కో సంస్థకు 1.89%, క్యాప్రి గ్లోబల్‌ హోల్డింగ్స్‌ 1.82%, క్యాప్రి గ్లోబల్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ 2%, బయాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 1.36%, ట్రినిటీ ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు 1.61% వాటాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు