ఆ షేర్లకు ‘ఆక్సిజన్‌’!

20 Apr, 2021 05:23 IST|Sakshi

గ్యాస్‌ పేర్లు ఉన్న సంస్థల షేర్లకు డిమాండ్‌

బీవోఐఎల్‌ స్టాక్‌ అప్పర్‌ సర్క్యూట్‌

కంపెనీ పేరులో ఆక్సిజన్‌ అనే పదం ఉండటమే కారణం

న్యూఢిల్లీ: పేరులో ఏముంది అంటారు గానీ ఒక్కోసారి ఆ పేరే అదృష్టం తెచ్చిపెట్టవచ్చు. బాంబే ఆక్సిజన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ (బీవోఐఎల్‌) అనే కంపెనీయే దీనికి తాజా ఉదాహరణ. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ పేషంట్ల ట్రీట్‌మెంట్‌కు ఆక్సిజన్‌ డిమాండ్‌ భారీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ లాంటి వాయువుల తయారీ కంపెనీలకు మంచి ఆదాయాలు వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్టర్లు గ్యాస్‌ల తయారీ సంస్థల షేర్లను కొనేందుకు ఎగబడుతున్నారు. బీవోఐఎల్‌కి కూడా ఇదే కలిసి వచ్చింది. కంపెనీ పేరులో ఆక్సిజన్‌ అని ఉండటంతో ఇన్వెస్టర్లు బీవోఐఎల్‌ షేర్ల కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా ర్యాలీ చేస్తున్న సంస్థ షేరు సోమవారం బీఎస్‌ఈలో అప్పర్‌ సర్క్యూట్‌ తాకింది. రూ. 24,575 దగ్గర ఆగింది. పేరులో ఆక్సిజన్‌ అని ఉన్నప్పటికీ తత్సంబంధ వ్యాపారాలేమీ చేయడం లేదంటూ కంపెనీ చెబుతుండటం గమనార్హం.

ఆక్సిజన్‌ వ్యవహారం.. సందేహాస్పదం..
వాస్తవానికి కంపెనీ వెబ్‌సైట్‌లోని హోంపేజీ ప్రకారం 1960లో బాంబే ఆక్సిజన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అనే పేరుతో సంస్థ ప్రారంభమైంది. అయితే, 2018 అక్టోబర్‌ నుంచి కంపెనీ పేరు బాంబే ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ (బీఐఎల్‌)గా మారింది. ప్రధాన వ్యాపారం పారిశ్రామిక గ్యాస్‌ల తయారీ, సరఫరానే అయినప్పటికీ 2019 ఆగస్టు నుంచి దాన్నుంచి తప్పుకున్నట్లు ప్రస్తుతం షేర్లు, ఫండ్లు తదితర సాధనాల్లో పెట్టుబడుల ద్వారానే ఆదాయం ఆర్జిస్తున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్లో పేర్కొంది. అంతే కాకుండా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్‌ (ఎన్‌బీఎఫ్‌సీ)గా ఆర్‌బీఐలో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నట్లు తెలిపింది.

ఇక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ .. వెబ్‌సైట్లోని ’ఉత్పత్తులు’ సెక్షన్లో మాత్రం ఇప్పటికీ ఆక్సిజన్, ఇతర పారిశ్రామిక గ్యాస్‌ల పేర్లు అలాగే కొనసాగుతుండటం గమనార్హం. ఆ సెక్షన్‌లో కంపెనీ తనను తాను ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్‌ డైఆక్సైడ్‌ వంటి పారిశ్రామిక గ్యాస్‌ల తయారీ సంస్థగాను, డీలర్‌గాను పేర్కొంటోంది. కానీ బీఎస్‌ఈలోని కంపెనీ పేజీలో మాత్రం సంస్థ ఎన్‌బీఎఫ్‌సీగానే నమోదై ఉంది. ఈ గందరగోళ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని, ఇన్వెస్టర్లకు లేటెస్ట్‌ సమాచారం అందించాలని కంపెనీకి బీఎస్‌ఈ ఏప్రిల్‌ 8న సూచించింది. సంస్థ మాత్రం తాము ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను ఇస్తూనే ఉన్నామంటూ బదులిచ్చింది.

ప్రత్యేక దృష్టి..
బాంబే ఆక్సిజన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ షేర్లు గత కొద్దిరోజులుగా భారీగా ర్యాలీ చేశాయి. మార్చి ఆఖరు నాటికి సుమారు రూ. 10,000 స్థాయిలో ఉన్న షేరు ధర కొన్నాళ్లలోనే ఏకంగా రెట్టింపయ్యాయి. కంపెనీ పేరులో ఆక్సిజన్‌ అన్న పదం ఉండటమే ఈ ర్యాలీకి కారణమని మార్కెట్‌ వర్గాలు అం టున్నాయి. దీనితో పాటు సంస్థ వ్యాపార వ్యవహారాలపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో బీఎస్‌ఈ దీన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో దీనితో పాటు పాత, కొత్త పేర్లలో ’గ్యాస్‌’, ’ఆక్సిజన్‌’ అన్న పదాలుండీ, ఇటీవల ర్యాలీ చేసిన ఇతర షేర్లపైనా దృష్టి సారించినట్లు వివరించాయి.

మరిన్ని వార్తలు