బోనస్‌, రైట్స్‌ ఇష్యూ- ప్రయోజనాలేంటి?

8 Aug, 2020 14:27 IST|Sakshi

వాటాదారులకు ఫ్రీగా షేర్ల జారీ- బోనస్‌

మార్కెట్‌ ధర కంటే తక్కువకు షేర్లు- రైట్స్‌

బోనస్‌- రైట్స్‌ తదుపరి షేరు ధరలో సర్దుబాటు

కంపెనీ పనితీరు ఆధారంగా షేరు ధరలో వృద్ధి

కొద్ది రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో రైట్స్‌ ఇష్యూల సందడి కనిపిస్తోంది. ఇదే విధంగా కొన్ని కంపెనీలు బోనస్‌ ఇష్యూలను సైతం ప్రకటిస్తుంటాయి. నిజానికి ఇవి రెండూ వాటాదారులకు లబ్ది చేకూర్చేవే. అయితే ఈ రెంటి మధ్య ప్రధాన తేడా ఏవిటంటే.. బోనస్‌ అంటే వాటాదారులకు ఫ్రీగా షేర్లులభిస్తాయి. రైట్స్‌ అంటే మార్కెట్‌ ధర కంటే తక్కువలో షేర్లను కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుంది. బోనస్‌, రైట్స్‌ ఇష్యూలపై మార్కెట్‌ విశ్లేషకులు ఇలా వివరిస్తున్నారు...

రైట్స్‌- బోనస్‌ ఇలా
శుక్రవారం సమావేశమైన బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి అనుమతించినట్లు అనుహ్‌ ఫార్మా తాజాగా ప్రకటించింది. అంటే వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 1 షేరుకీ మరో షేరుని ఫ్రీగా జారీ చేయనుంది.  ఇందుకు సెప్టెంబర్‌ 11 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. ఈ తేదీలోగా కంపెనీలో వాటా కలిగిన వాటాదారులకు ఫ్రీగా షేర్లు లభిస్తాయి. ఇక నెల రోజుల క్రితం ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ 1:1 నిష్పత్తిలో రైట్స్‌ ఇష్యూ చేపట్టింది. ఇందుకు మార్కెట్‌ ధర కంటే 70 శాతం తక్కువగా రూ. 50 ధరను నిర్ణయించింది. జులై3 రికార్డ్‌ డేట్‌. అయితే వాటాదారులు తప్పనిసరిగా రైట్స్‌ ద్వారా షేర్లను కొనుగోలు చేయాలన్న నిబంధనేమీ లేదు. 

సర్దుబాటు ఇలా
బోనస్‌ లేదా రైట్స్‌కు రికార్డ్‌ డేట్‌ దాటాక ఆయా కంపెనీల షేర్లు సర్దుబాటుకు లోనవుతుంటాయి. ఉదాహరణకు అనుహ్‌ ఫార్మా షేరు రికార్డ్‌ డేట్‌కు మందురోజు రూ. 300 వద్ద ముగిసిందనుకుందాం. తదుపరి రోజు నుంచీ రూ. 150 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమవుతుంది. ఎందుకంటే.. బోనస్‌ షేర్ల జారీతో కంపెనీ ఈక్విటీ రెట్టింపునకు చేరుతుంది కదా! ఇదే విధంగా రైట్స్‌ జారీ తదుపరి ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ ఈక్విటీ సైతం డబుల్‌ అవుతుంది. దీంతో షేరు ధర సగానికి సర్దుబాటు అవుతుంది. 

రిజర్వ్‌ నిధులు
సాధారణంగా పటిష్ట క్యాష్‌ఫ్లో కలిగి,  నగదు నిల్వలు అధికంగా ఉన్న కంపెనీలు బోనస్‌ షేర్లను జారీ చేస్తుంటాయి. తద్వారా వాటాదారులకు కంపెనీపట్ల విశ్వాసం, బ్రాండ్‌ విలువ పెరుగుతుంది. ఇక మరోవైపు రైట్స్‌ చేపట్టడం ద్వారా కంపెనీలు చౌకగా నిధులను సమకూర్చుకోగలుతాయి. బ్యాంకు రుణాలైతే వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు రైట్స్‌ ద్వారా ఎంఅండ్ఎం ఫైనాన్స్‌ రూ. 3,089 కోట్లు సమకూర్చుకుంది. ఈ నిధులను కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. తద్వారా కంపెనీ పనితీరు మరింత మెరుగయ్యే వీలుంది. ఇందువల్లనే రికార్డ్‌ డేట్‌ తదుపరి రోజునే ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ షేరు 10 శాతం జంప్‌చేసింది. 

దీర్ఘకాలంలో
ఉదాహరణకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ లేదా రైట్స్‌ ఇష్యూలను చేపట్టినప్పుడు కంపెనీల ఈక్విటీ క్యాపిటల్‌ రెట్టింపునకు పెరుగుతుంది. దీంతో  కంపెనీల షేరువారీ ఆర్జన(ఈపీఎస్‌) సగానికి తగ్గిపోతుంది. అంటే ఇష్యూకి ముందు రూ. 20 ఈపీఎస్‌ ఉంటే తదుపరి రూ. 10కు చేరుతుంది. ఇందువల్లనే షేరు ధర సైతం ఇదే విధంగా సర్దుబాటుకు లోనవుతుంది. అయితే ఇష్యూల తరువాత కంపెనీలు మెరుగైన పనితీరు చూపగలిగితే.. తిరిగి ఆయా షేర్ల ధరలు  జోరందుకుంటాయి. దీర్ఘకాలంలో అంటే రిజర్వ్‌ నిధులను వినియోగించుకోవడం.. లేదా రైట్స్‌  ద్వారా సమకూర్చుకున్న నిధులను సమర్ధవంతంగా వెచ్చించడం ద్వారా కంపెనీలు స్థూల అమ్మకాలు, నికర లాభాలను పెంచుకోగలిగితేనే వాటాదారులకు లబ్డి చేకూరుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆర్థిక పనితీరు నీరసిస్తే.. ఈక్విటీ పెరగడంతో షేర్ల విలువలు మరింత క్షీణించే రిస్కులు సైతం ఉంటాయని తెలియజేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు