Multi Commodity Exchange: బంగారంలోనూ భారీగా తగ్గిన లావాదేవీలు

27 Aug, 2021 07:38 IST|Sakshi

ముంబై: కొద్ది నెలలుగా బుల్‌ ధోరణిలో సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్ల కారణంగా కమోడిటీలలో ట్రేడింగ్‌ క్షీణిస్తూ వస్తోంది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజీ(ఎంసీఎక్స్‌)లో లావాదేవీల పరిమాణం నీరసిస్తోంది. ఎంసీఎక్స్‌లో ప్రధానమైన పసిడిలో లావాదేవీలు కొన్నేళ్ల కనిష్టానికి చేరాయి. వెరసి కమోడిటీ ఎక్ఛేంజీలో నిరుత్సాహకర పరిస్థితులు తలెత్తినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇతర విభాగాలలోనూ ట్రేడింగ్‌ తగ్గుతూ వచ్చినట్లు తెలియజేశారు. 2011 గరిష్టంతో పోలిస్తే పరిమాణం తగినంతగా పుంజుకోలేదని వివరించారు.
  
ఇదీ తీరు 

2011లో రోజువారీగా ఎంసీఎక్స్‌లో సగటున రూ. 48,326 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. ప్రస్తుతం రూ. 28,972 కోట్లకు పరిమితమవుతోంది. ఇది 40 శాతం క్షీణతకాగా.. పసిడి ఫ్యూచర్స్‌లో లావాదేవీలు మరింత అధికంగా 54 శాతం పతనమయ్యాయి. రోజువారీ సగటు టర్నోవర్‌ రూ. 5,723 కోట్లకు చేరింది. 2011లో రూ. 12,436 కోట్లు చొప్పున రోజువారీ సగటు టర్నోవర్‌ నమోదైంది.
  
చమురు డీలా 

ఎంసీఎక్స్‌లో మరో ప్రధాన విభాగమైన చమురులో ట్రేడింగ్‌ సైతం ఇటీవల వెనుకంజ వేస్తోంది. చమురు ఫ్యూచర్స్‌లో రోజువారీ సగటు టర్నోవర్‌ 2012లో రూ. 9,421 కోట్లను తాకింది. మొత్తం ఎఫ్‌అండ్‌వోను పరిగణిస్తే రూ. 9,963 కోట్లుగా నమోదైంది. అయితే 2021లో రూ. 5,280 కోట్లకు ఈ పరిమాణం పడిపోయింది. 2014 నుంచీ ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్‌కు బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌లు), ఈటీఎఫ్‌లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు)ను అనుమతించినప్పటికీ లావాదేవీలు పుంజుకోకపోవడం గమనార్హం!  చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!!

స్టాక్‌ ఎక్ఛేంజీల స్పీడ్‌ 
దిగ్గజ స్టాక్‌ ఎక్సే్ఛంజీలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ట్రేడర్లను భారీగా ఆకట్టుకోవడంతో ఎంసీఎక్స్‌ వెనుకబడుతూ వచ్చింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో 7.8 కోట్ల మంది, ఎన్‌ఎస్‌ఈలో 4.5 కోట్లమంది ప్రత్యేకతరహా రిజస్టర్డ్‌ క్లయింట్లు(యూసీలు) నమోదై ఉన్నారు. 2003 నుంచి బులియన్, చమురు ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో పోటీయేలేని ఎంసీఎక్స్‌ 2021 జులైకల్లా 69.86 లక్షల మంది యూసీలను మాత్రమే కలిగి ఉంది. అయితే ఇదే కాలంలో ఎంసీఎక్స్‌ షేరు మాత్రం 2013 ఆగస్ట్‌లో నమోదైన రూ. 290 నుంచి 2020 అక్టోబర్‌కల్లా రూ. 1,875కు చేరింది. ప్రస్తుతం మార్కెట్‌ విలువ రూ. 7,482 కోట్లను తాకింది. ప్రధానంగా సుప్రసిద్ధ స్టాక్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా ఎంసీఎక్స్‌లో 5 శాతం వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో షేరు ర్యాలీ చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.  

కోటక్‌ వాటా 15శాతం.. 
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం కోటక్‌ గ్రూప్‌ 15 శాతం వాటాను కలిగి ఉంది. 2021 మార్చికల్లా రూ. 685 కోట్ల నగదు నిల్వలను కలిగి ఉంది. ఇటీవల సాంకేతిక సేవల కోసం టీసీఎస్‌ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తోంది. కొంతకాలంగా పసిడిలో స్పాట్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌కు వీలైన టెక్నాలజీని సొంతం చేసుకోవడంలో ఎంసీఎక్స్‌ సమస్యలు ఎదుర్కొంటోంది. కాగా..  ఎక్సే్ఛంజీలలో 100 శాతం యాజమాన్యవాటాకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించనుందన్న వార్తలతో ఎంసీఎక్స్‌ షేరుకి మరింత బూస్ట్‌ లభించే అవకాశమున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.  

మరిన్ని వార్తలు