ఇళ్లకు డిమాండ్‌ కల్పించండి

25 Jan, 2021 05:10 IST|Sakshi

వ్యక్తిగత ఆదాయపన్ను ఉపశమనం ఇవ్వాలి  

ఇళ్ల కొనుగోలుపైనా పన్ను రాయితీ

జీఎస్‌టీ విషయమై వెసులుబాటు   

రియల్‌ఎస్టేట్‌ పరిశ్రమ వినతులు

కేంద్ర బడ్జెట్‌ 2021–22లో ఇళ్లకు డిమాండ్‌ సృష్టించే చర్యలకు చోటివ్వాలని రియల్‌ ఎస్టేట్‌ రంగం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. వ్యక్తిగత ఆదాయపన్ను ఉపశమనానికి తోడు, ఇళ్ల కొనుగోలుపై పన్ను రాయితీలను ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో భాగంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. అదే విధంగా వడ్డీ రాయితీని కొనసాగించాలని, జీఎస్‌టీని ఎత్తివేయాలని, రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమకు మౌలికరంగ హోదా కల్పించాలని, ఈ రంగానికి నిధుల లభ్యతను సులభతరం చేయాలంటూ క్రెడాయ్‌ బెంగాల్‌ శాఖా పలు డిమాండ్లు వినిపించింది. వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో వినియోగించే సిమెంట్‌ తదితర ముడి సరుకుల కోసం చెల్లించిన జీఎస్‌టీని అద్దె ఆదాయంలో సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాలని కోరింది.

దీనివల్ల ద్వంద్వ పన్నులను         నిరోధించడంతోపాటు.. దేశంలో ఆఫీస్‌ స్థలాలకు డిమాండ్‌ను పెంచినట్టు అవుతుందంటూ పారిశ్రామిక మండలి సీఐఐ సైతం కేంద్రానికి సూచించింది.  ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను రియల్‌ ఎసేŠట్ట్‌కు తిరస్కరించడం వల్ల డెవలపర్ల నిధులు బ్లాక్‌ (నిలిచిపోతాయని) అవుతాయని పేర్కొంది. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల ప్రాజెక్టుల పూర్తికి గాను రూ.25,000 కోట్ల నిధుల సాయాన్ని (స్ట్రెస్డ్‌ ఫండ్‌) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆఫర్‌ చేసిన విషయం గమనార్హం. అలాగే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 43(సీఏ) కింద రిజిస్ట్రేషన్, ఒప్పంద విలువ (సర్కిల్‌)ల మధ్య అంతరాన్ని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. 2021 జూన్‌ 30 వరకు ఇవి అమలు కానున్నాయి.

మద్దతుగా నిలవాలి..
‘‘మానవ చరిత్రలోనే 2020 ఎంతో అసాధారణమైనది. సాధారణ జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ తీవ్ర నిధుల సమస్యను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వాటాను అందిస్తున్న రియల్‌ ఎస్టేట్‌కు రంగాన్ని మరింత పెంచి పోషించాల్సి ఉంది. దాంతో వచ్చే పదేళ్లలో ఈ రంగం పెద్ద ఎత్తున దూసుకుపోతుంది’’ అంటూ క్రెడాయ్‌ పశ్చిమబెంగాల్‌ శాఖ ప్రెసిడెంట్‌ సుశీల్‌ మెహతా పేర్కొన్నారు.

     చౌక గృహ రుణంపై చెల్లిస్తున్న వడ్డీలో వార్షికంగా రూ. 2 లక్షల వరకు పన్ను రాయితీ ఉండగా, దీన్ని రూ. 5 లక్షలకు పెంచాలి.
     ఇంటి రుణంలో అసలుకు చెల్లించే మొత్తాలను సెక్షన్‌ 80సీ కింద గరిష్టంగా రూ.1.5లక్షల వరకు చూపించుకునేందుకు అనుమతిస్తుండగా.. ఇలా సెక్షన్‌ 80సీ కింద కాకుండా ప్రత్యేకంగా రూ. 1.5లక్షలపై పన్ను ఆదాకు అవకాశమివ్వాలి.
వాహనాల విలువ క్షీణతపై ప్రయోజనాలు కావాలి

ఆటోమొబైల్‌ పరిశ్రమ డిమాండ్‌
వాహనాల వినియోగంతో తరిగిపోయే విలువపై పన్ను ప్రయోజనాలు కల్పించాలంటూ ఆటోమొబైల్‌ పరిశ్రమ కేందాన్ని కోరింది. మరో వారంలో కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ రానున్న నేపథ్యంలో ఆటోమొబైల్‌ పరిశ్రమ పలు డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు వాహనాల తరిగే విలువను క్లెయిమ్‌ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. అలాగే, కార్పొరేట్లకు తరుగుదల కాలాన్ని పొడిగించాలని డిమాండ్‌ చేసింది. వాహన డీలర్లు వార్షికంగా 0.1 శాతం టీసీఎస్‌ (మూలం వద్దే పన్ను వసూలు)ను పక్కన పెట్టడం అన్నది ఆర్థికంగా వాహన రిటైల్‌ పరిశ్రమపై ఎంతో భారాన్ని మోపుతుందంటూ, దీన్ని తొలగించాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) కోరింది.

ఖరీదైన కార్లవైపూ చూడాలి..  
మరోవైపు.. ఖరీదైన కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్‌ బెంజ్, ఆడి, లంబోర్గిని బడ్జెట్‌లో లగ్జరీ వాహనాలపై పన్నుల భారాన్ని తగ్గించాలని కోరాయి. అధిక పన్నుల కారణంగా ఖరీదైన కార్ల విభాగం వృద్ధి చెందలేకపోతున్నట్టు పేర్కొన్నాయి. ఒకవేళ ఖరీదైన లగ్జరీ శ్రేణి కార్లపై పన్నులను తగ్గించడానికి బదులు పెంచే చర్యలకు వెళితే డిమాండ్‌ను దెబ్బతీయడమే కాకుండా, గతేడాది కరోనా కారణంగా ఏర్పడిన సమస్యల నుంచి కోలుకోకుండా చేసినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.   

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు