ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉద్యోగులు.. ఆదుకున్న యజమాని

7 Apr, 2022 10:25 IST|Sakshi

కరోనా కాటుకు ప్రపంచంలోని అనేక దేశాలు నెమ్మదిగా ద్రవ్యోల్బణం అంచుల్లోకి చేరుకుంటున్నాయి. వరుసగా పెట్రోలు, ఎలక్ట్రిసిటి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా జీతాలు పెరగక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అయితే వీళ్ల కష్టాలు చూడలేని ఓ కంపెనీ యజమాని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.  

ఇంగ్లండ్‌లో
ఇంగ్లండ్‌కి చెందిన ఎమెరీస్‌ టింబర్‌ అండ్‌ బిల్డర్‌ మర్చంట్స్‌ కంపెనీ యజమాని అరుదైన నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆ దేశంలో ఎలక్ట్రిసిటీ, గ్యాస్‌, పెట్రోలు పెట్రోలు ధరలు పెరిగిపోవడంతో, ఆ ఖర్చులకు తట్టుకునేలా ప్రతీ ఉద్యోగికి  జీతంతో పాటు అదనంగా 750 యూరోలు (సుమారు రూ. 74,251) అందించాడు ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ హిప్‌కిన్స్‌​. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించారు.

వ్యక్తిగతంగానే
పెరుగుతున్న ధరల కారణంగా ఎమెరీస్‌ కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడొద్దనే లక్ష్యంతోనే ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. తమ కంపెనీ ఉద్యోగులకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు అందించే సాయం మొత్తాన్ని కంపెనీ ఖాతా నుంచి కాకుండా ఎండీ జేమ్స్‌ హిప్‌కిన్స్‌ తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించారు. దీని కోసం ఆయన 45 వేల యూరోలు (సుమారు రూ. 44 లక్షలు) కేటాయించారు. ఎమెరీస్‌ కంపెనీలో 60 మంది ఉద్యోగులు ఉన్నారు.

అండగా ఉంటా
వరుసగా కొన్ని రోజులుగా పెట్రోలు రేట్లు పెరుగుతున్నాయి. గతంలో ఫ్యూయల్‌ కోసం 40 యూరోలు ఖర్చయ్యే చోట ఇప్పుడది 60 యూరోలుగా మారింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరగవచ్చంటూ అనేక నివేదికలు చెబుతున్నాయి. ఒక్క ఫ్యూయల్‌ మాత్రమే కాదు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో కంపెనీ ఉద్యోగులకు అండగా నిలవాలని అనిపించింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని జేమ్స్‌ హిప్‌కిన్స్‌ తెలిపారు.

సరికొత్త చర్చ
ఎమెరీస్‌ కంపెనీ తీసుకున్న నిర్ణయం సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. ఒపెక్‌ దేశాల ఒంటెద్దు పోకడలకు తోడు ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఎమెరీస్‌ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తూ సరికొత్త చర్చకు తెర తీసింది.
 
అంతటా ఇదే పరిస్థితి
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కన్సుమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (సీపీఐ) 6.2 శాతంగా నమోదు అయ్యింది. దీంతో అక్కడ పెట్రోలు, గ్యాస్, ఎలక్ట్రిసిటీతో సహా నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఇక్క ఇంగ్లండ్‌లోనే కాదు అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతం అవుతున్నాయి. మన దేశంలో గడిచిన రెండేళ్లలో లీటరు పెట్రోలు/డీజిల్‌ ధర రూ.40 వరకు పెరిగింది. 

చదవండి: పెట్రోల్‌ 118 నాటౌట్‌.. డీజిల్‌ 104 నాటౌట్‌.. గ్యాప్‌ లేకుండా బాదుతున్న చమురు సంస్థలు

మరిన్ని వార్తలు