Bounce: ఛార్జింగ్‌ సమస్యలకు చెక్‌..! ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో సరికొత్త పంథా..!

28 Nov, 2021 18:16 IST|Sakshi

బెంగళూరుకు చెందిన ప్రముఖ రెంటల్‌ బైక్‌ సర్వీసుల సంస్థ బౌన్స్‌ త్వరలోనే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేయనున్న విషయం తెలిసిందే. ఛార్జింగ్‌ కష్టాలకు చెక్‌పెడుతూ ‘బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌’ మోడల్‌తో బౌన్స్‌ రానుంది. అందుకుగాను  ఆటోమెటేడ్‌, మెకానికల్‌ పార్కింగ్‌ సర్వీసులను అందిస్తోన్న పార్క్‌ ప్లస్‌ కంపెనీతో బౌన్స్‌ కలిసి పనిచేయనుంది.  పార్క్‌ప్లస్‌ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 10 నగరాల్లో సుమారు 3500 బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లను బౌన్స్‌ ఏర్పాటుచేయనుంది. పార్క్‌ ప్లస్‌ అనేది కారు వినియోగదారులకు పార్కింగ్‌ స్లాట్‌లను చూపించే మొబైల్‌ యాప్‌. ఈ యాప్‌ సహయంతో ఆయా ప్రాంతాల్లో ఉండే బ్యాటరీ స్వాపింగ్‌ అవుట్‌లెట్లను చూపించనుంది. 

సరికొత్త పంథా..! ఛార్జింగ్‌ కష్టాలకు చెక్‌..!
ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో అతిపెద్ద సమస్య ఛార్జింగ్‌ సమయం. ఈవీ వాహనాలు నిర్దిష్ట దూరాలకు మాత్రమే  ప్రయాణిస్తాయి. వీటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి సుమారు  4 గంటల సమయం పడుతుంది. కాగా ఛార్జింగ్‌ కష్టాలకు చెక్‌పెడుతూ బౌన్స్‌ సరికొత్త పంథాతో మార్కెట్లలోకి రానుంది. ‘బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌’  మోడల్‌ను బౌన్స్ పరిచయం చేయనుంది. బౌన్స్‌ త్వరలోనే ఇన్ఫినిటీ అనే ఎలక్ట్రిక్‌ స్కూటర్లను లాంచ్‌చేయనుంది.


ఇన్ఫినీటీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను కొనుగోలుదారులు బ్యాటరీ లేకుండానే కొనుగోలు చేసే అవకాశాన్ని బౌన్స్‌ కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇన్ఫినిటీ బైక్‌ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 40 నుంచి 50 శాతం మేర బౌన్స్‌ ఇన్పినీటీ బైక్‌ ధరలు తగ్గే అవకాశం ఉంది.  ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ఛార్జ్‌ జీరో కాగానే సమీపంలో ఉండే పార్క్‌ప్లస్‌ బ్యాటరీ అవుట్‌లెట్ల సహయంతో ఫుల్‌ ఛార్జింగ్‌ బ్యాటరీలను క్షణాల్లో పొందే అవకాశాన్ని బౌన్స్‌ కల్పించనుంది. 
చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌..!

మరిన్ని వార్తలు