జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్‌పై దుమారం: అసలేమైంది?

9 Mar, 2023 16:03 IST|Sakshi

సాక్షి,ముంబై: మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ భారత్ మ్యాట్రిమోనీ  వివాదంలో ఇరుక్కొంది. హోలీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  కంపెనీ విడుదల చేసిన యాడ్‌పై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. పవిత్ర హోలీని అవమానకరంగా చిత్రీకరించి హిందూ మనోభావాలను దెబ్బతీశారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్‌కాట్ భారత్‌ మోట్రిమోనీ అన్న డిమాండ్‌ ఊపందుకుంది. ఈ యాడ్‌పై చర్చ కారణంగా ఇది ఇప్పటికే  1.5 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. 
 
రంగుల పండుగ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై భారత్ మ్యాట్రిమోనీ ఒక వీడియోను పోస్ట్‌ చేసింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం,హోలీ సందర్బంగా మహిళలకు సురక్షిత వాతావరణాన్ని సృష్టించాలంటూ తన యాడ్‌లో కోరింది. కొన్ని  కలర్స్‌( మరకలు) అంత తొందరగా మాసిపోవు. వేధింపుల వల్ల ప్రతీ ముగ్గురిలో ఒకమహిళ  హోలీకి దూరంగా ఉంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం వారి శ్రేయస్సును గౌరవించే సమాజాన్ని సృష్టించడం ముఖ్యం అని పేర్కొంది. అంతే ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. ‘‘మీకు హిందూ వినియోగదారులంటే లెక్కలేదా..సిగ్గుపడండి..బ్యాన్‌ భారత్‌ మోట్రిమోనీ’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.  

దీంతో ట్విటర్‌లో  #BoycottBharatMatrimony ట్రెండింగ్‌లో నిలిచింది. హోలీని తిట్టడమే లక్ష్యం. హిందూ పండుగలను హిందూ వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకోకండి అని ఒకరు ట్వీట్ చేయగా, భారత్ మ్యాట్రిమోనీ యాడ్‌ హిందూ సంప్రదాయాలను అగౌరవపరిచేదిగాను, హిందూ మత మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మరికొందరు ఆగ్రహించారు. హిందువుల పండుగలప్పుడు మాత్రమే మహిళల రక్షణ, కాలుష్యం, జంతువుల హక్కులు గుర్తొస్తాయా అంటూ ఇంకొకరు మండిపడ్డారు. ఈ యాడ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేయడంతోపాటు భారత్ మ్యాట్రిమోనీని నిషేధించాల్సిందేనని కమెంట్‌ చేస్తున్నారు.

ఈ యాడ్‌లో తప్పేమీ లేదంటూ  సంస్థ భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్థించిన వారు లేకపోలేదు. అలాగే సంస్కృతి పేరుతో ప్రతిదీ మంచిది కాదు. సతి, వరకట్నం కూడా భారతీయ సంస్కృతిలో భాగమే.  చెడును వ్యతిరేకించాలి.  హోలీ రోజున మహిళలపై వేధింపులు నిజమే. దీని వల్ల మొత్తం పండుగకే చెడ్డ పేరు వస్తుందని మరికొంతమంది యూజర్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో క్యాప్షన్‌ను సవరించి, సోషల్ మీడియా పేజీలలో తాజా పోస్ట్‌లను అప్‌లోడ్ చేసింది. అయినా విమర్శల సెగ చల్లార లేదు. 

కాగా ప్రకటనలపై విమర్శలు, వివాదం చెలరేగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో  ఫ్యాబ్ఇండియా, తనిష్క్‌,  సియట్‌ టైర్లు, అమోజాన్‌ లాంటి  పలు సంస్థలు దాదాపు ఇలాంటి వివాదాల్లో పడ్డాయి. ఇటీవల ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ హోలీ ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తాయి. హోలీ సందర్భంగా ప్రజలు ఒకరిపై ఒకరు గుడ్లు విసురుకోవద్దంటూ ఢిల్లీలోని స్విగ్గీ బిల్‌బోర్డ్ వివాదానికి దారితీయడంతో తరువాత, దాన్ని స్విగ్గీ తొలగించింది. 

మరిన్ని వార్తలు