బీపీసీఎల్‌ ‘నెట్‌ జీరో’ 2040

30 Aug, 2022 06:13 IST|Sakshi

10 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం

ఇతర వ్యాపారాల్లోకి విస్తరణ

తద్వారా ఆదాయ మార్గాలు పెంచుకుంటాం

సంస్థ చైర్మన్‌ అరుణ్‌కుమార్‌ సింగ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ బీపీసీఎల్‌.. పునరుత్పాదక ఇంధనాల తయారీపై భారీ ప్రణాళికలతో ఉంది. 2040 నాటికి 10 గిగావాట్ల పోర్ట్‌ఫోలియోను సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల స్థాయికి (నెట్‌ జీరో) చేరుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. బీపీసీఎల్‌ ఇతర వ్యాపారాల్లోకి విస్తరిస్తున్నట్టు చెప్పారు.

ఇది చమురు, గ్యాస్‌ వ్యాపారంలో ఆదాయ క్షీణతకు హెడ్జింగ్‌గా, అదనపు ఆదాయానికి మార్గం కల్పిస్తుందన్నారు. ‘‘ఆరు వ్యూహాత్మక విభాగాలను గుర్తించాం. పెట్రోకెమికల్స్, గ్యాస్, పునరుత్పాదక ఇంధనాలు, నూతన వ్యాపారాలు (కన్జ్యూమర్‌ రిటైలింగ్, ఈ మొబిలిటీ) భవిష్యత్తు వృద్ధికి మూల స్తంభాలుగా నిలుస్తాయి. వాటాదారులకు స్థిరమైన విలువను తీసుకొస్తాయి. ప్రధాన వ్యాపారమైన ఆయిల్‌ రిఫైనింగ్, పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్‌ ఎప్పటి మాదిరే స్థిరంగా కొనసాగుతుంది’’అని సింగ్‌ వివరించారు.

భిన్న వ్యాపారాలు..  
పునరుత్పాదక ఇంధనంలో ప్రస్తుతం గిగావాట్‌ కంటే తక్కువ ఉత్పాదక సామర్థ్యం ఉందని.. దీన్ని 2040 నాటికి 10 గిగావాట్లకు తీసుకెళ్లనున్నట్టు అరుణ్‌ కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంస్థకు ఉన్న 20వేల ఫ్యుయల్‌ స్టేషన్లు, 6,200 ఎల్పీజీ పంపిణీదారుల నెట్‌వర్క్‌ అండతో కన్జ్యూమబుల్స్, డ్యురబుల్స్‌ విక్రయాలు చేపట్టే ఆలోచనతో ఉన్నట్టు తెలిపారు. జాతీయ రహదారుల వెంట చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటును కూడా ప్రస్తావించారు. ప్రయోగాత్మక విధానంలో చెన్నై–తిరుచ్చి–మధురై హైవే 900 కిలోమీటర్లను తాము దత్తత తీసుకున్నామని, ప్రతి 100 కిలోమీటర్లకు చార్జింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. బినా, కోచి రిఫైనరీల వద్ద పెట్‌కెమ్‌ ప్రాజెక్టులు చేపట్టామని, ఇవి కార్యకలాపాలు ప్రారంభిస్తే.. ప్రస్తుతం ఒక శాతంగా ఉన్న మార్కెట్‌ వాటా 8 శాతానికి చేరుకుంటుందన్నారు. కొత్తగా 8 భౌగోళిక ప్రాంతాల్లో గ్యాస్‌ పంపిణీ లైసెన్స్‌లను సొంతం చేసుకున్నట్టు చెప్పారు. 

మరిన్ని వార్తలు