నేడు బీపీసీఎల్‌ బిడ్‌ల పరిశీలన!

15 Dec, 2020 06:21 IST|Sakshi

రేసులో మూడు సంస్థలు  

న్యూఢిల్లీ:  బీపీసీఎల్‌ ప్రైవేటీకరణలో మరో అడుగు ముందుకు పడింది. ఈ కంపెనీలో తనకున్న 52.98 శాతం వాటాను కేంద్రం విక్రయించనున్న విషయం తెలిసిందే. ఈ వాటా కొనుగోలు కోసం దరఖాస్తు చేసిన కంపెనీల బిడ్‌లను నేడు (మంగళవారం) అత్యున్నత సంఘం మదింపు చేయనున్నదని సమాచారం. ఈ వాటా కొనుగోలు కోసం వేదాంతతో పాటు అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్‌  క్యాపిటల్‌ (థింక్‌ గ్యాస్‌ మాతృసంస్థ)లు బిడ్‌లు సమర్పించాయి. ఈ బిడ్‌లను తనిఖీ చేసి డెలాయిట్‌ సంస్థ రూపొందించిన నివేదికపై ఈ అత్యున్నత సంఘం చర్చిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ లావాదేవీకి సలహాదారుగా  డెలాయిట్‌ సంస్థ వ్యవహరిస్తోంది.  

కేంద్రానికి రూ.46,600 కోట్లు...!
బీపీసీఎల్‌లో వాటా విక్రయానికి గత ఏడాది నవంబర్‌లోనే ఆమోదం లభించింది. అప్పటి నుంచి చూస్తే, షేర్‌ ధర 20 శాతం మేర పడిపోయింది. బీఎస్‌ఈలో   సోమవారం నాడు బీపీసీఎల్‌ షేర్‌ రూ.406 వద్ద ముగిసింది. ఈ ధర ప్రకారం చూస్తే 52.98 శాతం వాటాకు కేంద్ర ప్రభుత్వానికి రూ.46,600 కోట్లు లభిస్తాయి. కాగా ఈ వాటాను కొనగోలు చేసిన ఏ కంపెనీ అయినా మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఓపెన్‌ ఆఫర్‌కోసం మరో రూ.22,800 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. భారత్‌లో రెండో అతి పెద్ద ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఇదే. భారత ముడి చమురు రిఫైనరీలో బీపీసీఎల్‌ వాటా 15.33 శాతంగా ఉంది. ఇంధనాల మార్కెటింగ్‌లో ఈ కంపెనీ మార్కెట్‌ వాటా 22 శాతం. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా నాలుగు రిఫైనరీలున్నాయి. ముంబై(మహారాష్ట్ర), కోచి(కేరళ), బినా(మధ్యప్రదేశ్‌), నుమాలిఘర్‌(అస్సాం)లోని నాలుగు రిఫైనరీల వార్షిక చమురు శుద్ధి సామర్థ్యం 35.3 మిలియన్‌ టన్నులు. ఈ కంపెనీ మొత్తం 17,355 పెట్రోల్‌ పంపులు, 6,159 ఎల్పీజీ డీలర్లు, 61 విమానయాన ఇంధన స్టేషన్లను నిర్వహిస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు