బీపీసీఎల్‌ అమ్మకం ఇప్పుడే కాదు: హర్‌దీప్‌ సింగ్‌ పురి

16 Sep, 2022 08:25 IST|Sakshi

ముంబై: ఇంధన రంగ దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌) ప్రయివేటైజేషన్‌ ప్రతిపాదనేదీ ప్రస్తుతం తమ వద్ద లేదని చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఇప్పటికే ఎంతో ఆలస్యమైన కంపెనీ విక్రయం సమీప భవిష్యత్‌లో జరగకపోవచ్చని సంకేతాలిచ్చారు.

ఆస్తుల మానిటైజేషన్‌ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 2019 నవంబర్‌లో బీపీసీఎల్‌లో పూర్తి వాటాను విక్రయించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రభుత్వానికున్న 52.98 శాతం వాటాను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ కొనుగోలుకి మూడు సూచనప్రాయ బిడ్స్‌ సైతం లభించాయి. అయితే వేదాంతా గ్రూప్‌ నుంచి మాత్రమే ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలైంది. దీంతో 2022 మే నెలలో విక్రయ ప్రణాళికను రద్దు చేసిన ప్రభుత్వం పూర్తిస్థాయి సమీక్షకు ప్రతిపాదించింది.

పోటీ బిడ్డింగ్‌కు తెరతీసినప్పటికీ రేసులో ఒకే సంస్థ నిలిస్తే విక్రయ ప్రక్రియ ముందుకెలా సాగుతుందంటూ మంత్రి ప్రశ్నించారు. చమురు శాఖ ఇక్కడ నిర్వహించిన 25వ ఇంధన సాంకేతిక సదస్సును ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా విలేకరులకు బీపీసీఎల్‌ విక్రయ అంశాలను వివరించారు. 

మరిన్ని వార్తలు