Telangana: పెట్రోల్‌కి ప్రత్యామ్నాయం ఇథనాల్‌, అడ్డా తెలంగాణ!

14 Jul, 2021 11:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా భావిస్తోన్న ఇథనాల్‌ తయారీకి తెలంగాణ అడ్డా కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ఇథనాల్‌ తయారీ ప్లాంటు స్థాపనకు భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

తెలంగాణలో
వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉంది. వరితో పాటు మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువే. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ‘ఇంధన గ్రేడ్‌’ఇథనాల్‌ తయారీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేయాలని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ప్రతిపాదిస్తోంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్‌ తయారు చేసే 1జీ (ఫస్ట్‌ జనరేషన్‌) ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

రూ.1000 కోట్లతో స్థాపించే ఈ ప్లాంట్‌ ద్వారా రోజుకు 5 లక్షల లీటర్ల ఇథనాల్‌ తయారవుతుంది. ప్లాంటు ఏర్పాటుకు వంద ఎకరాల స్థలం  అవసరమవుతుందని అంచనా. ఈ ప్లాంటు రోజూవారీ కార్యకలాపాల నిర్వహణకు 4 వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇథనాల్‌ తయారీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరడంతో పాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి

అధికారులతో సమావేశం
తెలంగాణలో ఇథనాల్‌ తయారీ పరిశ్రమ నెలకొల్పే అంశంపై బీపీసీఎల్‌ ఎగ్జిక్టూటివ్‌ డైరెక్టర్‌ (జీవ ఇంధనాలు) అనురాగ్‌ సరోగి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో భేటీ అయ్యారు. జయేశ్‌ను కలసిన వారిలో బీపీసీఎల్‌ ఈడీ (ఇంజనీరింగ్, ప్రాజెక్టులు) ఎల్‌ఆర్‌ జైన్, కేహెచ్‌పీఎల్‌ ప్రాజెక్టు లీడర్‌ బి.మనోహర్‌ ఉన్నారు.

భవిష్యత్తులో ఇథనాల్‌
ఇథనాల్‌ తయారీ పరిశ్రమకు తమ మద్దతు ఉంటుందని కేంద్ర మంతత్రి నితిన్‌ గడ్కారీ ప్రకటించారు. పెటట్రోలు ఇథనాల్‌తో నడిచేలా ఫ్లెక్స్‌ ఇంజన్లు తయారు చేయాలంటూ వాహన తయారీదారులకు సూచించారు. అంతకు ముందు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ శాతం పెంచాలంటూ  ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్రం నుంచి ఇథనాల్‌ తయారీకి భారీగా మద్దతు దక్కుతున్న తరుణంలో కొత్త ప్లాంటు ఏ‍ర్పాటుకు బీసీసీఎల్‌ తెలంగాణను ఎంచుకోవడం గమనార్హం

మరిన్ని వార్తలు