నిఫ్టీ రికార్డు ర్యాలీకి విరామం

2 Jun, 2021 01:36 IST|Sakshi

సెన్సెక్స్‌ నాలుగు రోజుల  లాభాలకు అడ్డుకట్ట 

గరిష్ట స్థాయిల వద్ద  లాభాల స్వీకరణ 

 నిరాశపరిచిన ఆర్థిక గణాంకాలు 

ఆర్‌బీఐ పాలసీ ముందు అప్రమత్తత  

సెంటిమెంట్‌ను దెబ్బతీసిన రూపాయి పతనం

ముంబై: గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ మంగళవారం ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ మూడు పాయింట్ల స్వల్ప నష్టంతో 51,935 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఎనిమిది పాయింట్లను కోల్పోయి 15,575 వద్ద నిలిచింది. దీంతో నిఫ్టీ ఏడురోజులు, సెన్సెక్స్‌ నాలుగు రోజుల లాభాల ముగింపునకు విరామం పడినట్లైంది. మెటల్, బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనంతో ఐటీ, ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో ఉదయం నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 15,661 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్‌ సైతం 292 పాయింట్లు లాభపడి 52,229 స్థాయిని అందుకుంది. మిడ్‌ సెషన్‌ నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీల లాభాలన్నీ కరిగిపోయాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.230 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.450 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.  

‘‘ప్రపంచ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెండ్‌ క్రూడాయిల్‌ ధర 70 డాలర్లకు చేరుకుంది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి క్షీణత రెండోరోజూ కొనసాగింది. గత ఆర్థిక సంవత్సరపు జీడీపీ డేటాతో పాటు ఏప్రిల్‌ మౌలిక, మే తయారీ రంగ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచాయి. ఆర్‌బీఐ పాలసీ కమిటీ సమావేశాల ప్రారంభం(బుధ–శుక్ర)నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. వీటికి తోడు సూచీల వరుస ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ బినోద్‌ మోదీ తెలిపారు. 

మార్కెట్‌లో మరిన్ని విశేషాలు...  
ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ షేరు రెండు శాతం లాభపడి రూ.433 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.435.35 వద్ద ఆల్‌టైం హైని నమోదు చేసింది.  
కొత్త యాజమాన్య నియామకంతో బ్యాంకింగేతర సంస్థ మాగ్మా ఫిన్‌కార్ప్‌ షేరు ఐదు శాతం లాభపడి రూ.143 వద్ద స్థిరపడింది.  
 పీఈ దిగ్గజం కార్లయిల్‌ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ తెలపడంతో షేరు 20 శాతం పెరిగి రూ.631 వద్ద ముగిసింది.  
నాలుగో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను వెల్లడించడంతో నారాయణ హృదయాలయ షేరు 12 పెరిగి రూ.493 వద్ద నిలిచింది. 
బ్రిటన్‌ ఏస్‌ ఇన్వెస్టర్‌ జెరెమీ గ్రాన్‌థమ్‌ రూప కంపెనీలో వాటాను కొనుగోలు చేయడంతో షేరు 20 శాతం ర్యాలీ చేసి రూ.476 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు