BrickWork Ratings : జీడీపీలో వృద్ధి.. 10 నుంచి 10.5 శాతం నమోదు

9 Nov, 2021 09:43 IST|Sakshi

2021–22 భారత్‌ ఎకానమీపై బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ అంచనా

గత 9 శాతం అంచనా నుంచి పెంపు 

ముంబై: దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌  పెంచింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో తొలుత 9 శాతం వృద్ధిని అంచనా వేయగా, దీనిని ఎగువముఖంగా 10 నుంచి 10.5 శాతం శ్రేణికి సవరించింది. అనేక ఆర్థిక వృద్ధి సూచికలు ఆర్థిక కార్యకలాపాల్లో ఊహించిన దాని కంటే వేగంగా పునరుద్ధరణను సూచిస్తున్నాయని సోమవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌) వృద్ధి 20.1 శాతంగా నమోదయ్యింది. అయితే రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) 8.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది.  మూడవ వేవ్‌ రూపంలో వైరస్‌ తీవ్రత లేనట్లయితే మూడు, నాలుగు త్రైమాసికాల్లో కూడా భారీ ఆర్థిక వృద్ధి జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

వ్యాక్సినేషన్‌లో సాధించిన పురోగతి కారణంగా వల్ల ‘మూడవ వేవ్‌’ వచ్చినా, దానివల్ల ఏర్పడే ప్రతికూలతలు కూడా పరిమితంగానే ఉంటాయన్న అభిప్రాయాన్ని బ్రిక్‌వర్క్‌ రేటింగ్‌ వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఎకానమీకి కొన్ని ప్రతికూలతలు ఉన్నట్లు ఏజెన్సీ పేర్కొంది.  పెరుగుతున్న ముడి చమురు, ఖనిజ ఉత్పత్తులు, ముడిసరుకు,  సరుకు రవాణా ధరలు,  సెమీకండక్టర్‌ సరఫరాలో అంతరాయాలు,  బొగ్గు సరఫరా కొరత వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆయా సవాళ్లు వృద్ధి వేగాన్ని తగ్గించే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని వార్తలు