కరోనా : మరో చౌక ఔషధానికి అనుమతి

23 Jul, 2020 19:51 IST|Sakshi

'ఫావిపిరవిర్' విక్రయాలకు బ్రిటన్ ఫార్మాకు అనుమతి 

'ఫావిటన్' బ్రాండ్‌ పేరుతో రానున్న కరోనా డ్రగ్‌

200 మిల్లీ గ్రాముల టాబ్లెట్‌ ధర 59 రూపాయలు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నివారణకు సంబంధించి యాంటీ వైరల్ డ్రగ్‌ 'ఫావిపిరవిర్' విక్రయాలకు అనుమతి లభించిందని పుణెకు చెందిన బ్రింటన్ ఫార్మా ప్రకటించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చిందని బ్రిటన్ ఫార్మాస్యూటికల్స్ గురువారం వెల్లడించింది.

'ఫావిటన్' బ్రాండ్‌ పేరుతో 200 మి.గ్రా టాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఈ టాబ్లెట్లను 59 రూపాయల చొప్పున విక్రయిస్తామని బ్రింటన్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్లెన్‌మార్క్‌కు చెందిన ఫాబిఫ్లూ తరువాత, చవకగా లభించనున్న డ్రగ్‌ ఇదే కావడం విశేషం. ఫావిటన్ టాబ్లెట్‌ ధర 59 రూపాయలు.  కాగా ఫ్యాబిఫ్లూ టాబ్లెట్‌ ధర 75 రూపాయలు.

తేలికపాటి నుండి మధ్యస్థ లక్షణాలున్న కోవిడ్‌-19 రోగుల చికిత్సలో ఫావిపిరవిర్ సమర్థవంతమైన అనుకూలమైన ఫలితాలిస్తోందని, ఇందుకు క్లినికల్‌ సాక్ష్యాలున్నాయని బ్రింటన్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో అత్యవసర వినియోగానికి అనుమతి లభించిందనీ వెల్లడించింది. తమ స్ట్రాటజీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా ఈ ఔషధ లభ్యతను మెరుగుపరచడమే తమ ఉద్దేశమనీ,  అన్ని కోవిడ్ కేంద్రాల్లో ఫావిటన్‌ను అందుబాటులో ఉంచనున్నామని బ్రింటన్ ఫార్మా సీఎండీ రాహుల్ కుమార్ దర్దా చెప్పారు. అలాగే దీన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామన్నారు. కాగా జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్‌ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థగా ఉన్న ఫుజిఫిల్మ్‌ టొయమా కెమికల్‌ కంపెనీ ఫావిపిరవిర్‌ ను  ‘అవిగాన్‌’ బ్రాండ్‌తో విక్రయిస్తోంది. ఫావిటన్ అనేది అవిగాన్ జెనరిక్‌ వెర్షన్. 

మరిన్ని వార్తలు