బ్రిటానియా- కేఐవోసీఎల్‌ పతనం

20 Oct, 2020 11:44 IST|Sakshi

క్యూ2(జులై- సెప్టెంబర్‌) ఫలితాల ఎఫెక్ట్‌

5 శాతం పతనమైన బ్రిటానియా ఇండస్ట్రీస్‌

షేరుకి రూ. 110 ధరలో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌

10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకిన కేఐవోసీఎల్

విదేశీ ప్రతికూలతల కారణంగా ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 240 పాయింట్లు జంప్‌చేసి 40,671ను తాకింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 11,932 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ.. అంచనాలను చేరకపోవడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మరోపక్క ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ నిర్ణయాలు నిరాశపరచడంతో మెటల్‌, మైనింగ్‌ రంగ పీఎస్‌యూ కేఐవోసీఎల్‌ లిమిటెడ్‌ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. వెరసి ఈ రెండు షేర్లూ లాభాల మార్కెట్లోనూ భారీ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం..

బ్రిటానియా ఇండస్ట్రీస్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ నికర లాభం 23 శాతం పెరిగి రూ. 495 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 3,419 కోట్లను తాకింది. అమ్మకాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చూపనప్పటికీ వ్యయాల నియంత్రణ, తగ్గిన ముడి సరుకుల ధరలు కంపెనీ లాభదాయకత మెరుగుపడేందుకు దోహదం చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బ్రిటానియా షేరు 5 శాతం పతనమై రూ. 3,583 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 3,575 వరకూ వెనకడుగు వేసింది.  

కేఐవోసీఎల్‌ లిమిటెడ్
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు పీఎస్‌యూ కేఐవోసీఎల్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా ఒక్కో షేరుకీ రూ. 110 ధర మించకుండా 1.41 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు తెలియజేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 2.28 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 156 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్‌కు ఈ నెల 30 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేఐవోసీఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరువుకావడంతో రూ. 123 దిగువన ఫ్రీజయ్యింది.

మరిన్ని వార్తలు