కనీసం 2 ఎంబీపీఎస్‌ వేగం ఉండాలి

16 Nov, 2020 06:05 IST|Sakshi

బ్రాడ్‌బ్యాండ్‌ నిర్వచనాన్ని మార్చండి

ట్రాయ్‌కి బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం

న్యూఢిల్లీ: ‘దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ నిర్వచనాన్ని మార్చాలి. ఇంటర్నెట్‌ కనీస వేగం ఇప్పుడున్న 512 కేబీపీఎస్‌ నుంచి 2 ఎంబీపీఎస్‌కు చేర్చాలి’ అని బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం తన లేఖలో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని కోరింది. నిర్వచనం మార్పు, వేగం పెంపు ప్రతిపాదనలు ఎన్నాళ్ల నుంచో పెండింగులో ఉన్నాయని ఫోరం తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ, ఇంటర్నెట్‌ వేగం పెంపునకు ప్రణాళిక అన్న అంశంపై ట్రాయ్‌ సంప్రదింపుల పత్రంపై ఫోరం తన స్పందనను తెలియజేసింది.

‘కమ్యూనికేషన్‌ సాంకేతిక పరిజ్ఞానం కొన్నేళ్లుగా తీవ్రంగా మారిపోయింది. దేశంలో డేటా సేవలకు పూర్తిగా నూతన మార్కెట్లు పుట్టుకొచ్చాయి. ఇంటర్నెట్‌ ఆధారిత ఆధునిక అప్లికేషన్స్, వాటి వినియోగానికి ప్రస్తుత నిర్వచనం ప్రకారం నిర్దేశించిన దాని కంటే అధిక స్పీడ్‌ ఉండాలి. బ్రాడ్‌బ్యాండ్‌ ప్రస్తుత నిర్వచనం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి తగ్గట్టుగా లేదు. హైస్పీడ్‌ కోరుకునే కస్టమర్ల అవసరాలను తీర్చదు’ అని లేఖలో బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం స్పష్టం చేసింది.  

దేశంలో 4జీ అమలైనప్పటికీ..
ప్రస్తుతం ఉన్న 512 కేబీపీఎస్‌ వేగం చాలా తక్కువ. 2 ఎంబీపీఎస్‌కు చేర్చాలన్న ప్రతిపాదన చాలా కాలంగా పెండింగులో ఉందని బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం ప్రెసిడెంట్‌ టి.వి.రామచంద్రన్‌ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలే కాదు, నేషనల్‌ పాలసీ ప్రకారం కూడా ఈ వేగం తక్కువ అని ఆయన అన్నారు. ‘4జీ అమలైనప్పటికీ ప్రపంచంలోని మెరుగైన పద్ధతులతో పోలిస్తే సగం కంటే తక్కువగా వేగం ఉంది. టెక్నాలజీ ఏది వాడినా 2 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్, అప్‌లోడ్‌ స్పీడ్‌ అందించేలా నెట్‌వర్క్‌ ఉంటేనే బ్రాడ్‌బ్యాండ్‌గా పరిగణించాలి. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా బేసిక్, ఫాస్ట్, అల్ట్రా–ఫాస్ట్‌ విభాగాలుగా బ్రాడ్‌బ్యాండ్‌ అందించాలి.

సేవల అభివృద్ధి, వినియోగదార్ల అంచనాలకు అనుగుణంగా తరచూ పరిశీలన జరగాలి. 2 ఎంబీపీఎస్‌ కంటే వేగం అనే ప్రామాణికం ప్రధాన అవసరం ఇప్పుడు. అధిక నాణ్యత కలిగిన సేవలకై అదనపు మార్గదర్శకాలను ట్రాయ్‌ చేర్చాలి. 15 ఎంబీపీఎస్‌ వేగాన్ని ఫాస్ట్‌ బ్రాడ్‌బ్యాండ్‌గా, 30 ఎంబీపీఎస్‌ను అల్ట్రా ఫాస్ట్‌గా నిర్వచించాలి’ అని ఫోరం అభిప్రాయపడింది. గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, ఇంటెల్, క్వాల్‌కామ్, జియో, స్టార్, సిస్కో వంటి సంస్థలు ఫోరం సభ్యులుగా ఉన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు