కొత్త రిటైల్‌ ఇన్వెస్టర్ల రాకతో బ్రోకరేజ్‌ షేర్లకు గిరాకీ

30 Jul, 2020 13:11 IST|Sakshi

రెట్టింపు లాభాల్ని పొందిన 5పైసా లిమిటెడ్‌ షేరు

ఐసీఐసీసీ సెక్యూరిటీస్‌, జియోజిత్‌ ఫైనాన్స్‌ షేర్లకు డిమాండ్‌

కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్లు భారత స్టాక్‌మార్కెట్లోకి భారీ సంఖ్యలో వచ్చారు. రిటైల్‌ ఇన్వెస్టర్ల రాకతో బ్రోకింగ్‌ సంస్థల షేర్లకు అధిక డిమాండ్‌ నెలకొంది. ఈ ఏడాదిలో బ్రోకరేజ్‌ సంస్థలైన ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జియోజిత్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ లిమిడెట్‌ షేర్లు 17శాతం లాభపడ్డాయి. ఇదే సమయంలో ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ ఫైనాన్స్‌ ఇండెక్స్‌ 26శాతం నష్టాన్ని చవిచూడటం గమనార్హం. డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ సంస్థ 5పైసా లిమిటెడ్‌ షేరు ఈ ఏడాదిలో దాదాపు రెట్టింతల లాభాల్ని ఆర్జించింది. ఈ కంపెనీ స్థాపించి 4ఏళ్ల తర్వాత ఈ షేరు తొలిసారిగా ఈజూన్‌ క్వార్టర్‌లో లాభాల్ని ఆర్జించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

‘‘స్టాక్‌ మార్కెట్లో 1984 నుంచి ట్రేడింగ్‌ చేస్తున్నాను. ఇంత స్థాయిలో రిటైల్‌ ఇన్వెస్టర్ల యాక్టివిటీ గతంలో ఎన్నడూ చూడలేదు. క్యాష్‌ మార్కెట్లో గడచిన 3-4నెలల్లో రిటైల్‌ వాల్యూమ్స్‌ రికార్డు స్థాయిలో రెట్టింపు అయ్యాయి. రిటైల్ ట్రేడింగ్‌ గేమింగ్ యాక్టివిటీగా మారుతోంది. చాలామంది యువకులు, గేమ్స్‌లు ఆడటానికి బదులు స్టాక్‌ మార్కెట్లో ఆడుతున్నారు’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సీఈవో సీజే జార్జ్‌ తెలిపారు. 

అగ్రరాజ్యమైన అమెరికా ఉద్దీపన ప్రకటనలు భారీ ప్రకటించడంతో అన్ని దేశాలకు చెందిన ఈక్విటీ మార్కెట్లు కనిష్టస్థాయి నుంచి రికవరిని సాధించాయి. అలాగే మనదేశంలో లాక్‌డౌన్‌ పొడగింపుతో ఇతర అసెట్స్‌ క్లాసెస్‌లో రాబడులు తగ్గుముఖం పట్టాయి. దీంతో భారత్‌ స్టాక్‌మార్కెట్లోకి రిటైల్‌ ఇన్వెస్టర్ల రాక గతంలో కంటే భారీగా పెరిగింది.కొత్త ఇన్వెస్టర్లు అనుభవలేమితో తక్కువ ధరలకు లభించే,  ప్రమాదస్థాయిని అధికంగా కలిగిన పెన్నీ స్టాకుల్లో అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లను మించి ఈపెన్నీ స్టాకులు రాణిస్తున్నాయి.

కేవలం క్లయింట్లు మాత్రమే పెరగడం కాకుండా విస్తృత స్థాయిలో పార్టిసిపేషన్‌ పెరుగుతుంది. ఈ కొత్త ఇన్వెస్టర్లు ధీర్ఘకాలం పాటు మార్కెట్‌లో కొనసాగి సంపద వృద్ధికి తోడ్పడతారు అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ చీఫ్‌ విజయ్‌ చందక్‌ అభిప్రాయపడ్డారు. 1.9 ట్రిలియన్‌ డాలర్ల విలువ చేసే భారత మార్కెట్‌ మార్చి కనిష్టం స్థాయి నుంచి ఆసియాలోకెల్లా అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తూ 40శాతం రికవరిని సాధించింది. ఈ మొత్తం రికవరిలో 10శాతం ఈ జూలైలో సాధించడం విశేషం. అలాగే ఆసియాలో అధికంగా పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్ల భారీ స్థాయిలో పెట్టుబడులను పెట్టడం, ఔత్సాహిక ఇన్వెస్టర్లు స్టాక్‌లో రావడం తదితర కారణాలు మార్కెట్‌ రివకరికి కారణమయ్యాని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు