భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆస్తుల విక్రయం

2 Apr, 2022 06:03 IST|Sakshi

నాలుగు ప్రాపర్టీలపై జేవీ ఒప్పందం

బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి 51 శాతం వాటా

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ దేశ రాజధానిలోని వరల్డ్‌మార్క్‌సహా నాలుగు వాణిజ్య ఆస్తులను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా వీటిలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ బ్రూక్‌ఫీల్డ్‌ 51 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. రూ. 5,000 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువలో డీల్‌ కుదిరినట్లు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. మొత్తం 3.3 మిలియన్‌ చదరపు అడుగుల ఈ నాలుగు ఆస్తులపై భాగస్వామ్య(జేవీ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది.

ఆస్తుల జాబితాలో వరల్డ్‌మార్క్‌ ఏరోసిటీ(ఢిల్లీ), వరల్డ్‌మార్క్‌ 65, ఎయిర్‌టెల్‌ సెంటర్‌(గుర్‌గావ్‌), పెవిలియన్‌ మాల్‌(లూథియానా) ఉన్నట్లు పేర్కొంది. ఒప్పందంలో భాగంగా బ్రూక్‌ఫీల్డ్‌ రియల్టీ ఫండ్‌ 51 శాతం వాటాను పొందనుండగా.. మిగిలిన 49 శాతం వాటాతో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ కొనసాగనుంది. ఎంటర్‌ప్రైజ్‌ విలువ మదింపులో రుణభారాన్ని సైతం పరిగణించినట్లు కంపెనీ తెలియజేసిం ది. అయితే కచ్చితమైన ఒప్పంద విలు వను వెల్లడించలేదు. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి లావాదేవీ అమలుకానుంది. ఆస్తులను బ్రూక్‌ఫీల్డ్‌ అనుబంధ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌ ప్రాప ర్టీస్‌ మేనేజ్‌ చేయనున్నట్లు భారతీ వెల్లడించింది.  

ఆస్తుల వివరాలు: 1.43 మిలియన్‌ చదరపు అడుగుల వరల్డ్‌మార్క్‌ ఏరోసిటీ మిశ్రమ వినియోగ ఆస్తికాగా.. 7 లక్షల ఎస్‌ఎఫ్‌టీగల ఎయిర్‌టెల్‌ సెంటర్‌ కార్పొరేట్‌ సౌకర్యాలను కలిగి ఉంది. ఇక వరల్డ్‌మార్క్‌ 65 సైతం 7 లక్షల ఎస్‌ఎఫ్‌టీలో మిశ్రమ వినియోగానికి అనువుగా నూతనంగా నిర్మాణమైంది. దేశీయంగా బ్రూక్‌ఫీల్డ్‌ పలు నగరాలలో 47 మిలియన్‌ చదరపు అడుగుల వాణిజ్య రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. గతేడాది రూ. 3,800 కోట్ల ఐపీవో ద్వారా దేశీయంగా రియల్‌ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌ఈఐటీ)ను ఆవిష్కరించింది.

>
మరిన్ని వార్తలు