బీఎస్‌ఈ డివిడెండ్‌ రూ. 13.5

12 May, 2022 08:16 IST|Sakshi

న్యూఢిల్లీ: దిగ్గజ స్టాక్‌ ఎక్సేంజీ బీఎస్‌ఈ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 72 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 32 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 152 కోట్ల నుంచి రూ. 205 కోట్లకు జంప్‌చేసింది. వాటాదారులకు షేరుకి రూ. 13.50 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. మార్చిలో ప్రకటించిన బోనస్‌ ఇష్యూ తదుపరి పూర్తి ఈక్విటీపై డివిడెండు చెల్లించనుంది.

 గత కొన్నేళ్లుగా సంస్థలు, ఇన్వెస్టర్ల కోసం మార్కెట్లు, ప్రొడక్టులను బీఎస్‌ఈ నిర్మిస్తూ వచ్చినట్లు ఎక్సేంజీ ఎండీ, సీఈవో అశిష్‌కుమార్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. తద్వారా అన్ని రకాల ఆర్థిక పరిస్థితుల్లోనూ వృద్ధికి ఊతమిచ్చినట్లు తెలియజేశారు. ఈ  ఏడాది (2022–23)లోనూ వివిధ వృద్ధి అవకాశాలపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీఎస్‌ఈ నికర లాభం 73 శాతం దూసుకెళ్లి రూ. 245 కోట్లను తాకింది. 2020–21లో రూ. 142 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 48 శాతం వృద్ధితో రూ. 743 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 501 కోట్ల టర్నోవర్‌ నమోదైంది.

చదవండి: ఐసీఈఎక్స్‌పై సెబీ కొరడా!

మరిన్ని వార్తలు