-

ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..మారిన ఈ రూల్స్ గురించి మీకు తెలుసా?

12 Aug, 2021 07:51 IST|Sakshi

న్యూఢిల్లీ: చిన్న, మధ్య స్థాయి స్టాక్స్‌లో అస్థిరతలకు, విపరీతమైన స్పెక్యులేషన్‌కు కళ్లెం వేసే అదనపు నిఘా చర్యలను బీఎస్‌ఈ ప్రకటించింది. రూ.1,000 కోట్లలోపు మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీలపై ‘యాడ్‌ ఆన్‌ ప్రైస్‌ బ్యాండ్‌ ఫ్రేమ్‌వర్క్‌’ను అమలు చేయనుంది. అంతేకాదు.. ఎక్స్, ఎక్స్‌టీ, జెడ్, జెడ్‌పీ, జెడ్‌వై, వై గ్రూపుల్లోని స్టాక్స్‌కూ ఇది అమలు కానుంది. ఈ మేరకు బీఎస్‌ఈ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. నూతన నిబంధనలు ఈ నెల 23 నుంచి అమల్లోకి రానున్నాయి. 

వివిధ గ్రూపుల్లోని స్టాక్స్‌ రోజువారీ పెరగడం, తగ్గడానికి సంబంధించి పరిమితులు సాధారణంగా అమలవుతుంటాయని తెలిసిందే. సాధారణంగా 2–20 శాతం మధ్య రోజువారీ ధరల పరిమితి ఉంటుంది. అయితే యాడ్‌ ఆన్‌ ప్రైస్‌బ్యాండ్‌ ఫ్రేమ్‌వర్క్‌లోకి చేర్చిన కంపెనీలపై అదనపు ధరల పరిమితులు అమల్లోకి వస్తాయి. ఆరు నెలల్లో ఆరు రెట్లు, ఏడాదిలో 12 రెట్లు, రెండేళ్లలో 20 రెట్లు, మూడేళ్లలో 30 రెట్లు పెరిగిన స్టాక్స్‌ను గుర్తించి ఈ ఫ్రేమ్‌వర్క్‌ పరిధిలోకి బీఎస్‌ఈ చేరుస్తుంది. ఇటువంటి స్టాక్స్‌కు రోజువారీ ధరల పరిమితే కాకుండా.. వారం వారీ, నెలవారీ, త్రైమాసికం వారీగా ఇంతకుమించి పెరగడానికి లేకుండా అదనపు పరిమితులు అమల్లోకి వస్తాయి.

ఇందులో భాగంగా.. 2 శాతం రోజువారీ ప్రైస్‌బ్యాండ్‌లో ఉన్న స్టాక్‌ ఇక మీదట వారంలో మహా అయితే 1.1 రెట్ల వరకే పెరగడానికి వీలుంటుంది. అలాగే అంతక్రితం వారం ధరతో పోలిస్తే 0.9 రెట్ల వరకే నష్టపోయేందుకు అనుమతి ఉంటుంది. ఇదే విధంగా 5, 10, 20 శాతం ప్రైస్‌బ్యాండ్‌లోని స్టాక్స్‌కు వారం, నెల, త్రైమాసికంగా నిర్ణీత శాతం మేరే పెరగడానికి, తగ్గడానికి అనుమతి ఉంటుందని బీఎస్‌ఈ తన ఆదేశాల్లో పేర్కొంది. యాడ్‌ ఆన్‌ ప్రైస్‌బ్యాండ్‌ ఫ్రేమ్‌వర్క్‌లోకి చేరిన స్టాక్‌ 30 ట్రేడింగ్‌ రోజుల పాటు కొనసాగుతుందని తెలిపింది. కాకపోతే ఇంతకుముందు అన్ని స్మాల్, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయన్న ఆందోళన మార్కెట్‌వర్గాల్లో నెలకొనగా.. బీఎస్‌ఈ మరింత వివరణ ఇచ్చింది.

ఇది మంచిదే.. 
ఈ పరిణామంపై జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ విజయ్‌కుమార్‌ స్పందిస్తూ ‘‘మిడ్, స్మాల్‌క్యాప్‌ విభాగంలో పొంగు నెలకొంది. ఈ విభాగంలో చాలా స్టాక్స్‌కు లిక్విడిటీ తక్కువగా ఉండడంతో ట్రేడర్ల గ్రూపు కృత్రిమంగా ధరల పెంపు, తగ్గింపునకు (మానిప్యులేషన్‌) పాల్పడే అవకాశం ఉంటుంది. కనుక బీఎస్‌ఈ ప్రకటించిన ఈ చర్యలు మార్కెట్‌ బలోపేతం దిశగా మేలు చేస్తాయి’’అని అభిప్రాయపడ్డారు.    

చదవండి : డెబిట్‌ కార్డ్‌ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌, ఫ్రూప్‌ లేకుండానే

మరిన్ని వార్తలు