స్టాక్ మార్కెట్లో లాభాల పంట,బుల్‌ రంకెలేసింది..రికార్డుల మోత మోగించింది

2 Dec, 2022 07:13 IST|Sakshi

ముంబై: ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తుందనే ఆశలతో స్టాక్‌ సూచీల రికార్డుల ర్యాలీ ఎనిమిదో రోజూ కొనసాగింది. సానుకూల పీఎంఐ గణాంకాలు సెంటిమెంట్‌ను బలపరిచింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. మిడ్‌ సెషన్‌ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ర్యాలీ వేగం తగ్గింది. 

ముఖ్యంగా ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్స్‌ షేర్లు రాణించడంతో గురువారం సెన్సెక్స్‌ 185 పాయింట్లు లాభపడి 63,284 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 483 పాయింట్లు ఎగిసి 63,583 వద్ద తాజా జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 18,813 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 130 పాయింట్లు దూసుకెళ్లి 18,888 వద్ద కొత్త గరిష్టాన్ని నెలకొల్పింది. 

ఇంధన, ప్రైవేట్‌ బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్‌ అరశాతం ర్యాలీతో 1.36 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.289.86 కోట్లకు చేరింది. డిసెంబర్‌ తొలి ట్రేడింగ్‌ సెషన్‌లోనూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.1566 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2665 కోట్ల షేర్లను కొన్నారు. డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపుపై నెమ్మదిస్తామని ఫెడ్‌ రిజర్వ్‌ ప్రకటన తర్వాత ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఎనిమిది పైసలు బలపడి 81.22 స్థాయి వద్ద స్థిరపడింది.  

మార్కెట్లో మరిన్ని సంగతులు 
►సిమెంట్‌ షేర్లలో గురువారం ర్యాలీ చోటు చేసుకుంది. ఇన్‌పుట్‌ వ్యయాలు తగ్గడంతో పాటు వర్షాకాలం ముగియడంతో డిమాండ్‌ పుంజుకొని కంపెనీల మార్జిన్లు పెరగవచ్చనే అంచనాలతో ఈ రంగ షేర్లకు డిమాండ్‌ లభించింది. దాల్మియా భారత్, బిర్లా కార్పొరేషన్, జేకే సిమెంట్, ఇండియా సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్, అంబుజా సిమెంట్స్, రామ్‌కో సిమెంట్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు 1–5 శాతం ర్యాలీ చేశాయి. 

► జొమాటో షేరు రెండున్నర శాతం పెరిగి రూ.67 వద్ద స్థిరపడింది. ఆలీబాబాకు చెందిన ఆలీపే సింగపూర్‌ హోల్డింగ్‌ సంస్థ బుధవారం జొమాటోకు చెందిన 3.07 శాతం వాటా విక్రయించింది. దీంతో గడచిన రెండు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేరు ఆరుశాతం ర్యాలీ చేసింది. 

మరిన్ని వార్తలు