బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ- సరికొత్త రికార్డ్‌

10 Oct, 2020 10:49 IST|Sakshi

చరిత్రాత్మక గరిష్టానికి 4 శాతం దూరంలో సెన్సెక్స్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్నాలజీ, ఫార్మా దిగ్గజాల హవా

కొత్తగా లిస్టింగ్‌ పొందిన ఆరు కంపెనీలకూ వాటా

రూ. 160.68 ట్రిలియన్లకు చేరిన లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, సానుకూల ప్రపంచ సంకేతాల నేపథ్యంలో ఇటీవల జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డును సాధించాయి.  వారాంతాన ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 40,509 వద్ద ముగిసింది. దీంతో బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌(విలువ) రూ. 160.68 ట్రిలియన్లను తాకింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. తద్వారా ఈ ఏడాది(2020) జనవరి 17న సాధించిన రూ. 160.57 ట్రిలియన్ల రికార్డును అధిగమించింది. ఈ బాటలో జనవరి 20న నమోదైన 42,274 పాయింట్ల ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని అందుకునేందుకు సెన్సెక్స్‌ దాదాపు 4 శాతం దూరంలో నిలిచింది. డాలర్ల రూపేణా చూస్తే గత మూడేళ్లలో 14 శాతం పుంజుకోవడం ద్వారా దేశీ స్టాక్‌ మార్కెట్లు వర్ధమాన మార్కెట్లలో ముందంజలో ఉన్నాయి.  కాగా.. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ చరిత్రాత్మక గరిష్టానికి 20 శాతం దూరంలో నిలవడం గమనార్హం!  

ఐటీ, ఫార్మా దన్ను
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సెన్సెక్స్‌ విలువకు రూ. 4.67 ట్రిలియన్లను జమ చేయడం ద్వారా తొలి స్థానంలో నిలిచింది. ఈ బాటలో ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో కలసికట్టుగా రూ. 5.08 ట్రిలియన్ల విలువను అందించాయి. ఇక ఫార్మా దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, దివీస్‌ ల్యాబ్‌, అరబిందో ఫార్మా, బయోకాన్‌ రూ. 2 ట్రిలియన్లను సమకూర్చగా.. అదానీ గ్రీన్ ఎనర్జీ, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ రూ. 1.75 ట్రిలియన్లతో సహకరించాయి. 

న్యూ లిస్టింగ్స్‌
ఇటీవల స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఆరు కంపెనీల నుంచి సెన్సెక్స్‌ మార్కెట్‌ క్యాప్‌నకు రూ. 1.01 ట్రిలియన్లు జమయ్యింది. వీటిలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌, కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ తదితరాలున్నాయి. బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌లో 177 స్టాక్స్‌ జనవరి 17 స్థాయిలను అధిగమించగా.. 19 షేర్ల మార్కెట్‌ విలువలో సగానికిపైగా క్షీణించింది. జాబితాలో ఇండస్‌ఇండ్‌, కెనరా బ్యాంక్‌, పీఎన్‌బీ, బీవోబీ, ఫ్యూచర్‌ రిటైల్‌, స్పైస్‌జెట్‌ తదితరాలు చేరాయి.

మరిన్ని వార్తలు