సెన్సెక్స్‌ @ 50000

22 Jan, 2021 04:40 IST|Sakshi

చరిత్రలో తొలిసారి 50,000 మైలురాయిని చేరిన సెన్సెక్స్‌

భారత స్టాక్‌ మార్కెట్లో గురువారం ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ తన 42 ఏళ్ల చరిత్రలో తొలిసారి 50 వేల మైలురాయిని అందుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో హర్షద్‌ మెహతా, కేతన్‌ పరేష్, సత్యం కుంభకోణాలను చూసింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం, కోవిడ్‌–19 సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణలు, జీఎస్‌టీ అమలు, నోట్ల రద్దు నిర్ణయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. తన ఒడిదుడుకుల ప్రయాణంలో ఎన్నో రికార్డులను సృష్టిస్తూ.., వాటిని తానే తిరగరాస్తూ ముందుకు సాగింది. పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా కోలుకుని ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలుబెట్టుకుంది. 1979 ఏప్రిల్‌ 1న ప్రారంభమైనప్పటి నుంచి సెన్సెక్స్‌ ఇప్పటివరకు 16 శాతం వార్షిక సగటు రాబడి (సీఏజీఆర్‌)ని అందించింది.

కోవిడ్‌ ముందు... తర్వాత..!
కోవిడ్‌ వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో పాటు డిమాండ్‌ సన్నగిల్లడంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ క్రమంలో çసరిగ్గా 10 నెలల సెన్సెక్స్‌ కిత్రం(మార్చి 24న) సెన్సెక్స్‌ 25,638 స్థాయికి దిగివచ్చింది. ఈ కరోనా కాలంలో సెన్సెక్స్‌ ప్రపంచ ఈక్విటీ సూచీల్లోకెల్లా అత్యధికంగా 80 శాతం నష్టపోయింది. ఒకవైపు సంక్షోభం దిశగా కదులుతున్న ఆర్థిక వ్యవస్థ, మరోవైపు రోజురోజుకూ దిగివస్తున్న ఈక్విటీ సూచీలు.. వెరసి స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే నిరాశావాదంతో బుల్‌ మార్కెట్‌ పుట్టి, ఆశావాదంతో పరుగులు పెడుతుందనే వ్యాఖ్యలను నిజం చేస్తూ భారత మార్కెట్‌ దూసుకెళ్లడం సెన్సెక్స్‌కు కలిసొచ్చింది. ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహ అంచనాలు, కోవిడ్‌–19 వ్యాక్సిన్‌కు ఆమోదం, డాలర్‌ బలహీనతతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో వెల్లువెత్తిన విదేశీ పెట్టుబడులు సెన్సెక్స్‌ సంచలన ర్యాలీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్‌ మార్చి కనిష్టం నుంచి అంటే 208 రోజుల్లో 24,500 పాయింట్లు లాభపడింది. సూచీ 50 వేల స్థాయిని చేరుకొనే క్రమంలో గతేడాది మార్చి 13న 2,889 పాయింట్లను ఆర్జించి తన జీవిత చరిత్రలో అతిపెద్ద లాభాన్ని పొందింది. ఇదే 2020 మార్చి 23న 3,934 పాయింట్లను కోల్పోయి అతిపెద్ద నష్టాన్ని మూటగట్టుకుంది.  

మార్కెట్‌ విశేషాలు...
► ఫ్యూచర్‌ గ్రూప్‌తో వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు సెబీ ఆమోదం తెలపడంతో రిలయన్స్‌ షేరు 2 శాతం లాభపడింది.  
► క్యూ3 ఫలితాల ప్రకటన తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో హిందుస్థాన్‌ జింక్‌ 4 శాతం నష్టపోయింది.   
► హావెల్స్‌ ఇండియా షేరు 11 శాతం ర్యాలీ చేసి ఏడాది గరిష్టాన్ని తాకింది. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
► బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.196.50 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.

కొత్త గరిష్టాల నుంచి వెనక్కి...
♦ రెండురోజుల రికార్డుల ర్యాలీకి విరామం
♦ ముగింపులో 50 వేల దిగువకు సెన్సెక్స్‌  

సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్‌ మార్కెట్‌ రెండు రోజుల ర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. చివరి గంటలో బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్‌ 167 పాయింట్ల నష్టంతో 49,624 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 14,590 వద్ద స్థిరపడింది. ఆర్థిక వృద్ధిపై ఆశావహ అంచనాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఇంట్రాడే సెన్సెక్స్‌ 392 పాయింట్లు పెరిగి 50 వేల మైలురాయిని అధిగమించి 50,184 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ ఇండెక్స్‌ సైతం 108 పాయింట్లు పెరిగి 14,753 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. డాలర్‌ మారకంలో రూపాయి మూడోరోజూ బలపడటం కూడా కలిసొచ్చిందని చెప్పొచ్చు.  అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. దేశీయ పరిణామాలు కలిసిరావడంతో గురువారం సెన్సెక్స్‌ 305 పాయింట్ల లాభంతో చరిత్రాత్మక స్థాయి 50000 స్థాయిపైన 50,097 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 14,731 వద్ద మొదలైంది. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి.

సెన్సెక్స్‌ప్రెస్‌పై నిపుణులు ఏమన్నారంటే...
గడిచిన రెండు దశాబ్దాల్లో సెన్సెక్స్‌ 5000  పాయింట్ల నుంచి 50,000 పాయింట్ల వరకు చేసిన ప్రయాణం చిరస్మరణీయం. ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలే స్టాక్‌ సూచీలకు సోపానాలుగా మారుతాయి. మున్మందు.., పైపైకే... అనే సూత్రాన్ని విశ్వస్తున్నాను.
– రాధాకృష్ణ ధమాని, ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌

అతిపెద్ద బుల్‌ మార్కెట్‌ ఇప్పుడే ప్రారంభమైంది. భవిష్యత్తులో మార్కెట్‌ పెరిగేందుకు అనేక కారణాలు మున్ముందు రానున్నాయి. ముఖ్యంగా ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది కచ్చితంగా కలిసొచ్చే అంశమే అవుతుంది.
– రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, స్టాక్‌ మార్కెట్‌ బిగ్‌బుల్‌

50 వేల పాయింట్ల మైలురాయిని అందుకోవడం అనేది సెన్సెక్స్‌కు కేవలం ఒక ప్రయాణం మాత్రమే. ఇది గమ్యంæ కాదు. మరో పదేళ్లలో లక్ష పాయింట్లకు చేరుకుంటుందని భావిస్తున్నాము.
– విజయ్‌ కేడియా, కేడియా సెక్యూరిటీసీ చీఫ్‌ఏప్రిల్‌ 1, 1979 సెన్సెక్స్‌ – 100 పాయింట్లు
జూలై 25, 1990 సెన్సెక్స్‌ – 1000 పాయింట్లు
ఫిబ్రవరి 7, 2006 సెన్సెక్స్‌ – 10,000 పాయింట్లు
డిసెంబర్‌ 11, 2007 సెన్సెక్స్‌ – 20,000 పాయింట్లు
మార్చి 4, 2015 సెన్సెక్స్‌ – 30,000 పాయింట్లు
మే 23, 2019 సెన్సెక్స్‌ 40,000 జనవరి 21, 2021 సెన్సెక్స్‌ 50,000

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు