భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

19 Feb, 2021 17:33 IST|Sakshi

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం సాయంత్రం ట్రేడింగ్‌ ముగిసేసరికి బాంబే స్టాక్‌ మార్కెట్‌ ఎక్స్ఛేంజీ సూచీ 0.85 శాతం లేదా 434.93 పాయింట్లు దిగజారి 50,889.76 మార్క్‌ను చేరుకుంది. నిఫ్టీ సూచీ కూడా 0.91 శాతం లేదా 137.20 పాయింట్లు నష్టపోయి 14,981.75 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.55గా ఉంది. ఇంట్రాడేలో 51,432 వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌ 50,638 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉండడం సూచీలను కిందకు జారాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. నిరుద్యోగం పెరిగిపోయిందన్న సంకేతాలతో అమెరికా మార్కెట్లు తద్వారా ఆసియా మార్కెట్లు క్రితం సెషన్‌లో డీలా పడ్డాయి. ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, హీరో మోటోకార్ప్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ షేర్లు నష్టపోగా.. యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, గెయిల్‌ ఇండియా, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్ల ధరలు లాభపడ్డాయి.

చదవండి: 

బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే!

మరిన్ని వార్తలు