దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు.. ఎప్పట్నించి ప్రారంభం అంటే

6 Jan, 2023 10:26 IST|Sakshi

భువనేశ్వర్‌: ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ 2024 నుంచి 5జీ సర్వీసులను ప్రారంభిస్తుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం టీసీఎస్, సీ–డీవోటీ సారథ్యంలోని కన్సార్షియంను బీఎస్‌ఎన్‌ఎల్‌ షార్ట్‌లిస్ట్‌ చేసిందని ఆయన చెప్పారు. దీన్ని ఏడాది వ్యవధిలో 5జీకి అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు ఒడిషాలో జియో, ఎయిర్‌టెల్‌ 5జీ సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి వివరించారు.

ఒడిషాలో టెలికం కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు కేంద్రం రూ. 5,600 కోట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. మరోవైపు, రుణ సంక్షోభంలో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియాకు (వీఐఎల్‌) నిధులు సహా వివిధ అవసరాలు ఉన్నాయని వైష్ణవ్‌ తెలిపారు. ఎంత మేర పెట్టుబడులు కావాలి, ఎవరు ఎన్ని నిధులను సమకూర్చాలనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.

వీఐఎల్‌కు రూ. 2 లక్షల కోట్ల పైగా రుణ భారం ఉంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 16,000 కోట్ల వడ్డీని ఈక్విటీ కింద మార్చే ఆప్షన్‌ను వినియోగించుకోవాలని వీఐఎల్‌ నిర్ణయించుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 33 శాతం వాటా లభిస్తుండగా, ప్రమోటర్ల హోల్డింగ్‌ 74.99 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుంది. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు