‘బీఎస్‌ఎన్‌ఎల్‌కు వ్యతిరేకంగా..ప్రైవేటుకు అండగా కేంద్ర ప్రభుత్వం’

18 Aug, 2022 07:31 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  అపరిమిత డేటా.. అదీ ఎటువంటి స్పీడ్‌ నియంత్రణ లేకుండా. అదనంగా అపరిమిత కాల్స్‌. 30 రోజుల కాల పరిమితి గల ఈ ట్రూలీ అన్‌లిమిటెడ్‌ ప్యాక్‌ కోసం భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) రూ.398 చార్జీ చేస్తోంది. అపరిమిత డేటాతో రూ.98 నుంచి ప్యాక్‌లను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.

ప్రస్తుతానికి ఈ సేవలు 3జీ సాంకేతికతపైనే. భారత టెలికం రంగంలో చవక ధరలతో సేవలు అందించడమేగాక పారదర్శక సంస్థగా పేరున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. కేంద్ర ప్రభుత్వం అందించిన పునరుద్ధరణ ప్యాకేజీని ఆసరాగా చేసుకుని 4జీ, 5జీ సర్వీసుల్లోనూ ఇదే స్థాయిలో గనక చార్జీలను నిర్ణయిస్తే మార్కెట్లో సంచలనమే అని చెప్పవచ్చు. ప్రైవేట్‌ సంస్థలకు సవాల్‌ విసరడమేగాక అధిక చార్జీలకు కట్టడి పడడం ఖాయం. ఇదే జరిగితే బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త వైభవాన్ని సంతరించుకోవడం ఎంతో దూరంలో లేదు. అంతేకాదు సామాన్యులకూ నూతన సాంకేతికత చేరువ అవుతుంది. వచ్చే రెండేళ్లలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కనీసం 20 కోట్ల 4జీ, 5జీ కస్టమర్లను సొంతం చేసుకుంటుందని కేంద్రం భావిస్తోంది. 

5జీ సేవలూ అందించవచ్చు.. 
బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఊతమిచ్చేందుకు రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ జూలైలో ఆమోదించింది. ఇందులో  రూ.43,964 కోట్లు నగదు రూపంలో, రూ.1.2 లక్షల కోట్లు నగదుయేతర రూపంలో నాలుగేళ్ల వ్యవధిలో కేంద్రం అందించనుంది. 4జీ సర్వీసులకై 900, 1800 మెగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీలో రూ.44,993 కోట్ల విలువైన స్పెక్ట్రంను బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం కేటాయించనుంది. 900, 1800 మెగాహెట్జ్‌ స్పెక్ట్రంతో 5జీ సేవలనూ అందించవచ్చు. అత్యంత మారుమూలన ఉన్న 24,680 గ్రామాలకు 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చే రూ.26,316 కోట్ల ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌కు సిబ్బంది బలమూ ఉంది. ప్రస్తుతం సంస్థలో సుమారు 62,000 మంది పనిచేస్తున్నారు. ప్రధాన పోటీ సంస్థల మొత్తం ఉద్యోగుల కంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది సంఖ్యా బలం ఎక్కువ. ఈ స్థాయి ఉద్యోగులతో వినియోగదార్లను గణనీయంగా పెంచుకోవచ్చు. జియో వద్ద 18,000, ఎయిర్‌టెల్‌ 20,000, వొడాఫోన్‌ ఐడియా వద్ద 13,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం.  

ప్రైవేటుకు అండగా.. 
ప్రభుత్వ పోకడలే సంస్థ ప్రస్తుత పరిస్థితికి కారణమని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ స్పష్టం చేసింది. టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఈ మేరకు ఘాటుగా లేఖ రాసింది. ‘బీఎస్‌ఎన్‌ఎల్‌కు వ్యతిరేకంగా, ప్రైవేటుకు అండగా ప్రభుత్వం వ్యవహరించింది. 2019 అక్టోబర్‌ 23న కేంద్రం బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ స్పెక్ట్రం కేటాయింపు కూడా ఉంది. ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల కారణంగా స్పెక్ట్రం ప్రయోజనాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ అందుకోలేకపోయింది. 49,300 టవర్లను అప్‌గ్రేడ్‌ చేసి ఉంటే రెండేళ్ల క్రితమే 4జీ సేవలు ప్రారంభం అయ్యేది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇది బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణకు తీవ్ర ఆటంకం కలిగించింది. 50,000ల 4జీ టవర్ల కొనుగోలుకై 2020 మార్చిలో టెండర్లను ఆహ్వానించింది. టెలికం ఎక్విప్‌మెంట్, సర్వీసెస్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఫిర్యాదుతో టెండర్‌ రద్దు అయింది. పైగా దేశీయ కంపెనీల నుంచే పరికరాలను కొనుగోలు చేయాలన్న నిబంధన పెట్టారు. ప్రైవేట్‌ కంపెనీలు విదేశీ సంస్థలైన ఎరిక్సన్, నోకియా, సామ్‌సంగ్‌ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌కు మాత్రమే ఎందుకీ నిబంధన? ఆలస్యం అయినప్పటికీ లాభా లు అందించే దక్షిణ, పశ్చిమ ప్రాంతంలో రూ.500 కోట్లతో నోకియా సహకారంతో 19,000 టవర్లను అప్‌గ్రేడ్‌ చేసి ఇప్పటికైనా 4జీ  అందించవచ్చు’ అని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి పి.అభిమన్యు మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.  

ఇది కంపెనీ స్థానం
ట్రాయ్‌ ప్రకారం 2022 మే 31 నాటికి 114.5 కోట్ల వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్లలో జియోకు 35.69%,  ఎయిర్‌టెల్‌ 31.62%, వొడాఐడియా 22.56% వాటా ఉంటే వెనుకంజలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ 9.85% వాటాకు పరిమితమైంది. మేలో జియో 30 లక్షలు, ఎయిర్‌టెల్‌ 10 లక్షల మంది  యూజర్లను కొత్తగా సొంతం చేసుకున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ 5.3 లక్షల మందిని కోల్పోయింది. దేశంలో వైర్‌లైన్‌ కస్టమర్లు 2.52 కోట్ల మంది ఉన్నారు. ఇందులో అగ్ర స్థానంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ వాటా 28.67%. జియోకు 26.7%, ఎయిర్‌టెల్‌కు 23.66% వాటా ఉంది. మొత్తం 79.4 కోట్ల బ్రాడ్‌బ్యాండ్‌ చందాదార్లలో జియో 52.18% వాటాతో 41.4 కోట్లు, ఎయిర్‌టెల్‌ 27.32%తో 21.7 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా 15.51%తో 12.3 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ 3.21% వాటాతో 2.55 కోట్ల మంది ఉన్నారు. వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో జియోకు 58.9 లక్షలు, ఎయిర్‌టెల్‌ 47.4 లక్షలు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 47.4 లక్షల మంది యూజర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు