Budget 2023: సెస్సులు, సర్‌చార్జీలు ఎత్తివేయాలి

23 Dec, 2022 06:18 IST|Sakshi

ఆర్థిక శాఖకు టీసీఎఫ్‌ బడ్జెట్‌ వినతులు

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు అదనపు భారంగా ఉంటున్న సెస్సు, సర్‌చార్జీలను ఎత్తివేయాలని, ట్యాక్స్‌ పరిధిలోకి మరింత మందిని చేర్చాలని బడ్జెట్‌కు సంబంధించి థింక్‌ చేంజ్‌ ఫోరం (టీసీఎఫ్‌) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. అలాగే, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రంగాలకు పన్నుల భారాన్ని తగ్గించాలని, ట్యాక్స్‌పేయర్లు నిబంధనలను పాటించేలా పర్యవేక్షణను మరింత మెరుగుపర్చాలని పేర్కొంది. ఆర్థిక వృద్ధి సాధనకు, అభివృద్ధి పనులపై ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రభుత్వం పన్ను ఆదాయాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని టీసీఎఫ్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు.

అధిక పన్నుల భారం, సంక్లిష్టమైన ట్యాక్స్‌ విధానాలు మొదలైనవి వివాదాలకు దారి తీస్తున్నాయని, నిబంధనల అమలు సరిగ్గా లేకపోవడం వల్ల వసూళ్లపై ప్రభావం పడుతోందని వారు తెలిపారు. అక్రమ వ్యాపారాలను అరికట్టడానికి ప్రభుత్వ ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా పన్ను ఎగవేతదారులు మరింత వినూత్న వ్యూహాలతో స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు మాజీ చైర్మన్‌ పీసీ ఝా చెప్పారు. అత్యధిక నియంత్రణలు, పన్నులు ఉండే పరిశ్రమలైన పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాలిక్‌ పానీయాల రంగాల నుంచి ఖజానాకు రావాల్సిన రూ. 28,500 కోట్ల మేర ఆదాయానికి గండి పడుతోందని పేర్కొన్నారు. ఇలాంటివి అరికట్టేందుకు మరింత అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలని, పోర్టుల్లో మరిన్ని స్కానర్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు