Budget 2023: ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ పెంచండి..!

31 Dec, 2022 01:44 IST|Sakshi

దేశవ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరం పెరుగుతున్నందున ఆరోగ్యరంగానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. వారి అభిప్రాయాను ఒక్కసారి పరిశీలిస్తే...     

న్యూఢిల్లీ కేటాయింపులు 40 శాతం పెరగాలి
వరుసగా, 2021–22 – 2022–23 ఆర్థిక సంవత్సరాలను చూస్తే,  ఆరోగ్య రంగం కోసం బడ్జెట్‌ కేటాయింపులు సుమారు 16.5 శాతం పెరిగాయి. రానున్న బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి నిధులు 30–40 శాతం పెరగాలి. ఆరోగ్యం పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిండానికి ప్రయత్నం జరగాలి. పాఠశాల పాఠ్యాంశాల్లో ఆరోగ్యవంతమైన జీవన ప్రాముఖ్యతను తప్పనిసరిగా చేర్చాలి. మధుమేహం, ఇతర జీవనశైలి వ్యాధులపై స్థానిక సంస్థలు, చాంబర్లు, సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వం తప్పనిసరిగా పంచాయతీ స్థాయిలో ప్రాథమిక క్లినిక్‌లను ఏర్పాటు చేయాలి.  అవి సక్రమంగా పనిచేసేలా కూడా చూసుకోవాలి. టెలిమెడిసిన్‌ను సులభతరం చేయడానికి వీలుగా ఆయా క్లినిక్‌లను  డిజిటలీకరించాలి.     
– సాకేత్‌ దాల్మియా, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌   

రోగనిర్ధారణ వేగంగా జరగాలి
ప్రస్తుత పరిస్థితుల్లో త్వరిత, ఖచ్చిత, వేగవంతమైన రోగనిర్ధారణ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన డిమాండ్‌. సమర్థవంతమైన ఆరోగ్య నిర్వహణ,  అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రణ, రోగికి వేగవంతంగా కోలుకోవడం వంటి కీలక సానుకూలతకు దోహదపడే అంశం ఇది. ఈ దిశలో దేశంలో బహుళ–వ్యాధుల నిర్ధారణ ప్లాట్‌ఫారమ్‌లు అలాగే తక్కువ ధరలో సేవలు లభించే డయాగ్నోస్టిక్స్, వెల్‌నెస్‌ ప్రమోషన్‌ సెంటర్లు అవసరం. ఈ అంశాలపై రానున్న బడ్జెట్‌ దృష్టి సారించాలి.  వెల్‌నెస్‌ పరీక్షలు, ఆయుష్‌ చికిత్సలను ఆరోగ్య బీమాలో కవర్‌ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. పరిశోధనలకు ప్రోత్సాహం, ఇందుకు తగిన నిధుల కల్పన అవసరం. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ వ్యయాలు ప్రతి వ్యక్తికి సంవత్సరానికి దాదాపు రూ. 1,000 వరకూ తగ్గుతాయి.             
– అజయ్‌ పొద్దార్, సైనర్జీ ఎన్విరానిక్స్‌ చైర్మన్, ఎండీ

ఆరోగ్య బీమాపై దృష్టి అవసరం
భారత్‌లో హెల్త్‌కేర్‌పై తలసరి బీమా వ్యయం ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. దేశంలో 75 శాతం మందికిపైగా ప్రజలకు ఆరోగ్య బీమానే లేదు. ఈ సమస్యను ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్‌ దృష్టి పెట్టాలి.  
–  సిద్ధార్థ ఘోష్, ఎన్‌ఎంఐఎంఎస్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌

గత రెండేళ్లలో ఇలా..
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2023–24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె బడ్జెట్‌ రూపకల్పనపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించడం జరిగింది.  2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు వార్షిక బడ్జెట్‌ కేటాయింపులు రూ.73,932 కోట్లు. 2022–23లో ఈ కేటాయింపులు దాదాపు 16.5 శాతం పెరిగి రూ.86,200 కోట్లకు చేరాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) ఆరోగ్య రంగానికి కేటాయింపులు దాదాపు ఒక శాతంగా ఉండడం గమనార్హం.   

మరిన్ని వార్తలు