కోవిడ్19- రూటు మార్చిన బఫెట్

9 Nov, 2020 12:14 IST|Sakshi

సొంత షేర్ల కొనుగోలుకి ప్రాధాన్యం

2020 తొలి 9 నెలల్లో భారీ బైబ్యాక్స్

క్యూ3లోనూ 9 బిలియన్ డాలర్ల వెచ్చింపు

ఇతర కంపెనీలో పెట్టుబడులకు బ్రేక్

ఎయిర్ లైన్స్ కంపెనీలలో వాటాల విక్రయం

146 బిలియన్ డాలర్లకు నగదు నిల్వలు

న్యూయార్క్: కోవిడ్-19 కారణంగా ప్రపంచ ఇన్వెస్ట్ మెంట్ గురు వారెన్ బఫెట్ సైతం రూటు మార్చుకున్నారు. వెరసి ఈ ఏడాది(2020) తొలి 9 నెలల్లో సొంత కంపెనీ షేర్ల బైబ్యాక్ కు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. తద్వారా 16 బిలియన్ డాలర్లను బైబ్యాక్ కోసం వెచ్చించారు. గతేడాదిలో చేపట్టిన బైబ్యాక్ తో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికంకావడం గమనార్హం. బఫెట్ దిగ్గజ కంపెనీ బెర్క్ షైర్ ఇటీవల చేపట్టిన పెట్టుబడులను సైతం బైబ్యాక్ మించినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. 2019లో ఆక్సిడెంటల్ పెట్రోలియం కార్ప్ డీల్, ఏడాది కాలంపాటు ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ షేర్ల కొనుగోలుకి వెచ్చించిన నిధులకంటే ఇవి అధికమని పేర్కొన్నారు.

కరోనా కాటు
కోవిడ్-19 ప్రభావంతో ఇన్వెస్ట్ మెంట్ దిగ్గజం బఫెట్ పెట్టుబడి ప్రణాళికల్లో కొంతమేర యూటర్న్ తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రికార్డ్ బైబ్యాకులు, జపనీస్ ట్రేడింగ్ సంస్థలలో వాటాలు, నేచురల్ గ్యాస్ ఆస్తుల కొనుగోలు తదుపరి పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేశారు. కొద్ది నెలల క్రితమే ఇన్వెస్ట్ చేసిన యూఎస్ ఎయిర్ లైన్స్ కంపెనీలలో వాటాలను భారీగా విక్రయించారు. నిజానికి కొంతకాలంగా పేరుకుపోతున్న నగదు నిల్వలతో భారీ కొనుగోళ్లకు తెరతీయాలని భావించిన బఫెట్.. కరోనా వైరస్ కారణంగా ప్రణాళికలు మార్చుకున్నట్లు నిపుణులు వివరించారు. 

8 శాతం డౌన్
ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో బైబ్యాక్ పై 9 బిలియన్ డాలర్లను వెచ్చించినట్లు బెర్క్ షైర్ తాజాగా వెల్లడించింది. క్యూ4(అక్టోబర్- డిసెంబర్)లోనూ బైబ్యాక్ కొనసాగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. సెప్టెంబర్ కల్లా నగదు నిల్వలు 146 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు పేర్కొంది.  బైబ్యాక్స్, స్టాక్స్ లో పెట్టుబడుల నేపథ్యంలోనూ జూన్ మగింపుతో పోలిస్తే 1 బిలియన్ డాలర్లు మాత్రమే తక్కువకావడం విశేషం. క్యూ3లో నిర్వహణ లాభం 32 శాతం క్షీణించి 5.48 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు బెర్క్ షైర్ శనివారం వెల్లడించింది. అయితే ఇంధన విభాగం మిడ్ అమెరికన్ ఎనర్జీ ఆర్జన 21 శాతం ఎగసినట్లు పేర్కొంది. కాగా.. బైబ్యాకులు చేపట్టినప్పటికీ ఈ ఏడాది ఇప్పటివరకూ బెర్క్ షైర్ క్లాస్ A షేరు 7.6 శాతం క్షీణించిన విషయాన్ని నిపుణులు గమనించదగ్గ అంశమంటున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా