బుల్ వేవ్- మార్కెట్లు గెలాప్

5 Nov, 2020 16:03 IST|Sakshi

724 పాయింట్ల హైజంప్- 41,340కు సెన్సెక్స్

212 పాయింట్లు ఎగసి 12,120 వద్ద ముగిసిన నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ ప్లస్- రియల్టీ వీక్

మెటల్, మీడియా, బ్యాంకింగ్‌, ఎఫ్ఎంసీజీ జూమ్

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.7 శాతం అప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి హైజంప్ చేశాయి. వెరసి సెన్సెక్స్ 41,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయిట్ల మైలురాళ్లను సులభంగా అధిగమించేశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 724 పాయింట్లు జంప్‌చేసి 41,340కు చేరగా.. నిఫ్టీ 212 పాయింట్లు జమ చేసుకుని 12,120 వద్ద నిలిచింది. కేవలం 4 రోజుల్లోనే సెన్సెక్స్ 1,750 పాయింట్లను ఖాతాలో వేసుకోవడం విశేషం. ప్రెసిడెంట్ పదవి రేసులో ఉన్న ట్రంప్, జో బైడెన్ కు సమాన అవకాశాలున్నట్లు వెలువడిన అంచనాల నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు 1.5-4 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో దేశీయంగానూ ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా ఏ దశలోనూ మార్కెట్లు వెనుదిరిగి చూడలేదు. 41,030 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ తదుపరి మరింత జోరు చూపుతూ వచ్చింది.  

మెటల్స్ మెరుపులు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. రియల్టీ మాత్రమే(0.5 శాతం) నీరసించింది. ప్రధానంగా మెటల్, మీడియా, బ్యాంకింగ్, ఎఫ్ ఎంసీజీ 4-2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్,  హిందాల్కో, ఎస్బీఐ, బీపీసీఎల్, టాటా స్టీల్, గెయిల్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, బజాజ్ ఫిన్, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ 6.2-3 శాతం మధ్య జంప్ చేశాయి. బ్లూచిప్స్ లో కేవలం హీరో మోటో 0.6 శాతం, హెచ్డీఎఫ్సీ లైఫ్ 0.2 శాతం చొప్పున డీలాపడ్డాయి.

పీవీఆర్ జూమ్
డెరివేటివ్స్‌లో సెయిల్, పీవీఆర్, హెచ్పీసీఎల్, ఎస్ఆర్ఎఫ్, నాల్కో, సన్ టీవీ, ఎన్ఎండీసీ, ఇండిగో, ముత్తూట్, జీ, బీఈఎల్ 11-5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ సీపీ, లుపిన్, అపోలో టైర్, పెట్రోనెట్ 7-0.2 శాతం మధ్య  నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,737 లాభపడగా.. 913 మాత్రమే నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐలు ఓకే
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 146 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) కేవలం రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,274 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1101 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 741 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 534 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు